రాష్ట్రాన్ని అంబానీకి అమ్మేసే కుట్ర

15 Feb, 2018 11:44 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో రావి వెంకటరమణ, పక్కన కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు

సీఎంపై వైఎస్సార్‌ సీపీ నేతల ధ్వజం

నెహ్రూనగర్‌: రాష్ట్రాన్ని అమ్మేయడానికేనా రిలయన్స్‌ అధినేత అంబానీతో సీఎం చర్చలు జరిపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకటరమణ ఆరోపించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్య, సాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ పెట్టుబడులు తీసుకొచ్చి అన్నదాతను రోడ్డున పడేయాలని చూస్తున్నావా అంటూ మండిపడ్డారు.

అంబానీతో కలవడంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు యూనిట్‌ కరెంట్‌ చార్జీ రూ.2.75 పైసలు ఉంటే టీడీపీ అధికారంలోకి రాగానే రూ.9 వసూలు చేస్తున్నారని తెలిపారు. పెట్రోలు, డీజీల్‌ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ పెట్టుబడులకు వ్యతిరేకం కాదని, అన్యాయం జరిగితే మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిలారి రోశయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి మందపాటి శేషగిరిరావు, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు