కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి

9 Jun, 2019 18:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు రాజకీయ ఉన్మాది అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందన్నారు. శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్‌కి(టీఆర్‌ఎస్‌) 95 లక్షల ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 75 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడతావా అని.. ప్రజలు నాలుగు నెలల్లోనే కేసీఆర్‌ని చెప్పుతో కొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్ధేశిస్తూ.. పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా అవుతారు.. పీసీసీ అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లు.. ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు  ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలి
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనం చేసుకోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ డబ్బులతో రాజకీయాలను నడుపుతున్నారని మండిపడ్డారు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే కూడా కేసీఆర్ ఓర్వడం లేదన్నారు. ప్రతిపక్షం లేకుండా ఉంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో  ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో దోపిడీ చేస్తున్నారన్నారు. బట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షకు పూర్తి సంఘీభావం తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని థీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు