శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం: రోజా

1 Aug, 2018 08:21 IST|Sakshi

సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని, గతంలో ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు