‘వైజాగ్‌ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా’

20 Jul, 2020 15:59 IST|Sakshi

చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

సాక్షి, తాడేపల్లి: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్లాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు బిల్లులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా ? చెప్పాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి మీకు కావాలా వద్దా ? ఇవాళ ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఒక కథనం వచ్చింది. వైజాగ్‌లో ఏదో జరిగిపోతుందని కథనంలో రాసుకొచ్చారు. 

ఇలాంటి కథనాలతో వైజాగ్‌ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా ? అక్కడి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వైజాగ్‌ ఏం పాపం చేసింది. వైజాగ్ ప్రజలతో రాజధాని మాకొద్దు అని చెప్పించేలాగా ఉన్నారు. ఇది మహా పాపం. మాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది కావాలి.  టీడీపీ వెర్షన్‌నే రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని కేంద్రం చెప్పింది. విభజన చట్టానికి రాజధానికి సంబంధం లేదు. అన్నీ ఒకే చోట ఉండాలని ఎక్కడా లేదు’అని ఆయన పేర్కొన్నారు.

ఎన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి ఆగదు
అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అసెంబ్లీలో చర్చ కూడా జరిగిందని సజ్జల గుర్తు చేశారు. అసెంబ్లీలో రెండోసారి బిల్లుకు ఆమోదం లభించిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యం చేసి బిల్లులను అడ్డుకున్నారని సజ్జల మండిపడ్డారు. సెలక్ట్ కమిటీ పేరుతో టీడీపీ సభ్యులు కాలయాపన చేయాలని చూశారని విమర్శించారు. సెలక్ట్ కమిటీ అనేది వాస్తవరూపం దాల్చలేదని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ముందడుగు వేశారని సజ్జల పేర్కొన్నారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
(డాలర్‌ శేషాద్రికి కరోనా అంటూ అసత్య పోస్టులు)

>
మరిన్ని వార్తలు