శరద్ పవార్‌ తప్పుచేయలేదు: సంజయ్‌ రౌత్‌

27 Sep, 2019 18:00 IST|Sakshi
శరద్‌ పవార్‌-సంజయ్‌ రౌత్‌ (ఫైల్‌ఫోటో)

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్‌కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో  శరద్ పవార్ ప్రేమేయం ఏమీ లేదని, కుంభకోణం వెలుగుచూసిన సమయంలో పవార్ అధికారంలో కూడా లేరని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో జరిగిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. 'పవార్ పెద్ద నేత. బ్యాంకుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.  ఇలాంటి కేసుల్లో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. స్కామ్ జరిగినప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. ఆయన పార్టీ నేతలు ఉండొచ్చేమో కానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు' అని సంజయ్ రౌత్ తెలిపారు.

బ్యాంకు కుంభకోణంలో ఆయన పేరు చేర్చడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు శరద్‌ పవార్‌కు మద్దతుగా రౌత్‌ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా  ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ఈడీ తేల్చింది. పవార్, ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు 70 మంది ఎంఎస్‌సీ బ్యాంకు అధికారు పేర్లను అందులో చేర్చింది.

మరిన్ని వార్తలు