కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన లూలూ ప్రసాద్‌..!

22 Mar, 2019 20:48 IST|Sakshi

బిహార్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలన్ని కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లనున్నట్లు ఇటీవల ఆయా పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల సీట్ల పంపకాలు శుక్రవారం పూర్తయ్యాయి. ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రకటించారు. కేంద్ర మాజీమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ సారథ్యంలోని లోక్‌జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు.

అంతేకాకుండా లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ నేత శరద్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ గుర్తుతో పోటీ చేస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎల్‌జేడీ కూటమితో కలిసి పని చేస్తుందని మనోజ్ ఝా వివరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే  జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కూటమి షాకిచ్చింది. సీట్ల కేటాయింపులో కన్హయ్య పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్జేడీ పోటీ చేసే స్థానాల్లో ఒక సీటును మాత్రమే సీపీఐ(ఎంఎల్‌)కి కేటాయిస్తామని మనోజ్‌ ఝా వెల్లడించారు.

కాగా ఆయన బెగుసరాయ్‌ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కన్హయ్య అభ్యర్థిత్వానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సుముఖంగా లేరని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బెగుసరాయ్‌ నుంచి ఆర్డేడీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన తన్వీర్‌ హసన్‌ను అక్కడి నుంచి పోటీచేయించాలని లాలూ ప్రయత్నిస్తున్నారు. బెగూసరయ్‌లో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుందని, గ్రౌండ్‌లెవన్‌లో వామపక్షాలు అంత బలంగా లేరని ఆర్జేడీ భావిస్తోంది. ఇదిలావుండగా కన్హయ్య కుమార్‌ను  సీపీఐ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన విషయ తెలిసిందే. 

మరిన్ని వార్తలు