పవార్‌ వ్యూహం.. అజిత్‌కు ఆహ్వానం!

24 Nov, 2019 14:23 IST|Sakshi

అజిత్‌తో​ చర్చలకు దూతను పంపిన శరద్‌

వెనక్కి రావాలని విజ్ఞప్తి

సాక్షి, ముంబై: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించడంతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దూకుడు పెంచారు. బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు తన వ్యూహాలకు మరింత పదునుపెట్టారు. ఎన్సీపీపై తిరుగుబావుటా ఎగరేసిన అజిత్‌ పవార్‌ను వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అజిత్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్‌ పాటిల్‌ను దూతగా ప్రయోగించారు. అజిత్‌తో చర్చలు జరిపి వెనక్కి తీసుకురావాలి పాటిల్‌ను ఆదేశించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అజిత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆయన కోసం ఎన్సీపీ తలుపులు తెరిసే ఉంటాయని అన్నారు. అజిత్‌ వెనక్కి వస్తారన్న నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. (మహా సంక్షోభం: సుప్రీం కీలక ఆదేశాలు)

మరోవైపు సుప్రీం విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో హోటల్‌లో శరద్‌ భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.  కాగా  ఫడ్నవిస్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన అజిత్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు ఆయన ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఫడ్నవిస్‌కు మద్దతు ప్రకటించిన అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆదివారం వారంతా ఎన్సీపీ చీఫ్‌​ శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్‌ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం నలుగురు మాత్రమే అజిత్‌ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్‌ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు శివసేన కూడా తన ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. (అజిత్‌ పవార్‌కు ఝలక్‌..!)

కాగా సీఎంగా ఫడ్నవిస్‌ను ప్రమాణ స్వీకారం చేయిస్తూ.. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారం విచారణ జరిపింది. బల పరీక్షకు అంత తొందరేమీ లేదని, గవర్నర్‌కు ఫడ్నవిస్‌ ఇచ్చిన లేఖను వెంటనే తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్‌, అజిత్‌ పవార్‌లకు నోటీసులు జారీచేసింది. బలపరీక్షను వెంటనే చేపట్టాలన్న విపక్షాల విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో పఢ్నవిస్‌ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.

మరిన్ని వార్తలు