పార్టీ కోరితే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటా : థరూర్‌

28 May, 2019 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లోంచి రాహుల్‌ గాంధీ మాత్రమే బయట పడేయగలరని ఆ పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్ అభిప్రాయపడ్డారు.  ఓ ఆంగ్ల మీడియాకి​చ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక కాంగ్రెస్ పని అయిపోయింది’ అని కొం‍దరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వారివి చాలా తొందరపాటు వ్యాఖ్యలు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ ఫలితాలు కూల్చలేవు. ఈ ఓటమిని తల్చుకుని బాధపడటం కన్నా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవడం చాలా మంచిది. అలాగే పార్టీ కోరితే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ తరఫున ప్రతి పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధమే’ అన్నారు శశి థరూర్‌.

అంతేకాక ప్రస్తుతం దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు థరూర్‌. పార్టీ స్థాపించిన నాటి నుంచి గాంధీ-నెహ్రూ కుటుంబం కాంగ్రెస్‌కి ఎంతో సేవ చేసింది. అలాంటి వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఓటమికి ఒక వ్యక్తినే బాధ్యున్ని చేయడం మంచి పద్దతి కాదని థరూర్‌ అభిప్రాయపడ్డారు. అయినా కుడా రాహుల్‌ గాంధీ ఒక్కరే అందుకు బాధ్యత వహించడం గొప్ప విషయమన్నారు. కానీ, పార్టీ పరాజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి.. పూర్వ వైభవాన్ని తెచ్చేలా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాహుల్‌ పట్ల ఎంతో అభిమానముందని ఈ సందర్భంగా థరూర్‌ పేర్కొన్నారు.

ఒకవేళ అధ్యక్ష పదవికి మరెవరైనా పోటీ పడితే వారిని రాహుల్‌ భారీ మెజారిటీతో ఓడించడం ఖాయమన్నారు థరూర్‌. అందరినీ కలుపుకొనిపోయి, పార్టీని ముందుకు నడపడంలో ప్రస్తుతానికి రాహుల్‌కు మించిన నేత కాంగ్రెస్‌లో మరొకరు లేరని ఆయన అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ ఏం చేసినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు. దేశంలో రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం లాంటి తీవ్ర సమస్యలున్నప్పటికీ ప్రజలు మోదీకే ఓటేశారన్నారు. దీనికి ప్రజల మధ్య బీజేపీ రేపిన మతవిద్వేషాలు ఒక కారణమైతే.. దేశాన్ని నడిపించడానికి మోదీ తప్ప మరో నాయకుడు లేడని చేసిన తప్పుడు ప్రచారం మరో కారణమని థరూర్‌ ఆరోపించారు. (చదవండి : మోదీని రాహుల్‌ జయించాలంటే..?)

మరిన్ని వార్తలు