బీజేపీ వెనకడుగు.. సీఎం పీఠంపై శివసేన!

10 Nov, 2019 19:18 IST|Sakshi

ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు

ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం పీఠం!

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేనను గవర్నర్‌ ఆహ్వానించాల్సి ఉంది. లేదా ప్రభుత్వ  ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం ఉన్నందున, తమకు అవకాశం ఇవ్వాలని శివసేన నేతలు గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. బీజేపీ వెనక్కి తగ్గడంలో ఎమ్మెల్యేలతో శివసేన కీలక భేటీ నిర్వహించింది. హోటల్‌ రిట్రీట్‌లో క్యాంప్ చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలతో  సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేదా..? ఒకవేళ చేస్తే బలపరీక్షలో ఎలా గట్టెక్కాలి అనే అంశాలపై నాయకులు చర్చిస్తున్నారు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. వీరి భేటీ అనంతరం గవర్నర్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీకి శివసేన మద్దతు తెలపకపోతే.. తర్వాత తాము శివసేనకు మద్దతు ప్రకటిస్తామని ఎన్సీపీ సంకేతాలు ఇ‍చ్చింది. అయితే ముందే తేరుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ కలుస్తాయని ముంబై వర్గాల సమాచారం. దీనిపై శివసేన ఎంపీ సంజయ్‌  రౌత్‌ స్పందిస్తూ.. సీఎం పీఠంపై శివసేన కూర్చోవడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే మద్దతు ఎలా కూడగడతారనేదానిపై మాత్రం ఆయన స్పందించలేదు. (చదవండి: మహారాష్ట్రలో బీజేపీ సంచలన నిర్ణయం).

మరోవైపు ప్రతిపక్షంలోనే ఉంటామని ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ స్వయంగా ప్రకటించినా.. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. శివసేన-ఎన్‌సీపీ కలిసి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇదే జరిగితే శివసేన సీఎం పీఠంపై కుర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కాంగ్రెస్‌ మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. మహారాష్ట్ర కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేలు ప్రస్తుతం జైపూర్‌లో క్యాంప్ చేస్తున్నారు. వారితో సీనియర్ నేత ఖర్గే సమావేశమై.. ప్రభుత్వఏర్పాటులో శివసేనకు మద్దతుపై అభిప్రాయాలు సేకరించారు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది సభ్యుల బలం ఉండాలి. దీంతో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిస్తే.. సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ దిశగానే శివసేన ప్రణాళికలు రచిస్తోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా