కాంగ్రెస్‌, బీజేపీల గట్టి ప్రయత్నాలు

2 Apr, 2019 12:45 IST|Sakshi
సిద్దిపేట టౌన్‌

సాక్షి, సిద్దిపేటజోన్‌: నియోజకవర్గ పరిధిలో లోక్‌సభ ఎన్నికలను మరోసారి తమకు అనుకూలంగా ఫలితాలు సాధించే దిశగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రణాళిక రూపోందించుకుంది. అదే దిశగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు శాసనసభ ఫలితాల చేదు అనుభవాల నుంచి పట్టుకోసం లోక్‌సభ ఎన్నికలను వేదికగా మలుచుకోనున్నాయి. తెలంగాణ ఉద్యమ గడ్డ, అభివృద్ధికి చిరునామగా మారిన సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా మలుచుకుంది. అప్పటి నుంచి నేటి వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన ఫలితాలే వచ్చాయి. గత కొన్నేళ్లుగా పార్టీ అభివృద్ధి పనులను నిర్వహిస్తూ దూకుడును పెంచింది. అందుకు నిదర్శనమే సిద్దిపేట నియోజకవర్గంలో గ్రామ సర్పంచ్‌ల, మున్సిపల్‌ వార్డుల, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే వేసుకుంది. 

లక్ష మెజార్టీయే లక్ష్యంగా ప్రచారం..
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు లక్ష పైచీలుకు రికార్డు మెజార్టీని సాధించి పోలైన ఓట్లలో అత్యధికం గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు క్యాడర్‌ కలిగి పార్టీ నియోజకవర్గంలో గట్టి పునాదులతో బలంగా ఉంది. ఇదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లక్ష మెజార్టీ అందించే లక్ష్యంతో గులాబీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు నియోజకవర్గంలో బలమైన క్యాడర్, నాయకత్వం లేక కాంగ్రెస్, బీజేపీలు పట్టుకోసం ఈ ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో లేకపోవడం కూటమి పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదు. మరోవైపు బీజేపీ పార్టీకి నియోజకవర్గంలో సరైన పునాది లేకపోవడంతో శాసనసభ ఫలితాలు నిరాశజనకంగా వచ్చాయి. అయినప్పటికీ కంచుకోట లాంటి సిద్దిపేటలో గులాబీ దాటిని తట్టుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు