23న కీలక భేటి; లేఖలు పంపిన సోనియా

16 May, 2019 20:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న 23న మహా కూటమిలోని భాగస్వాములతో పాటు పాత మిత్రులతో సమావేశం నిర్వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు సమాచారం. మహా కూటమిలోని ప్రధాన భాగస్వాములు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లతో పాటు.. తటస్థులు నవీన్‌ పట్నాయక్‌, కె. చంద్రశేఖర్‌రావులతో ఆమె సంప్రదింపులు జరపనున్నారని కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

23న సమావేశానికి హాజరుకావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌లకు లేఖలు పంపించినట్టు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పాత మిత్రులకు సోనియా కబురు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. డీఎంకే, నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలకు కూడా ఉత్తరాలు వెళ్లినట్టు సమాచారం. ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకపోతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు స్వయంగా సోనియా కల్పించుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి హాజరయ్యేందుకు ఎంకే స్టాలిన్‌, శరద్‌ పవార్‌ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత దాదాపు వెనుక సీటుకే ఆమె పరిమితమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరుగుతుండటంతో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తీసుకువచ్చి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో సోనియా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే పాత మిత్రులను యూపీఏ కూటమిలోని తీసుకురావాలన్న ఉద్దేశంతో సోనియా ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మాయావతి, అఖిలేశ్‌లతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతోనూ సోనియా టచ్‌లో ఉన్నారని తెలిపాయి. తటస్థ వైఖరితో ఉన్న బీజేడీ నేత నవీట్‌ పట్నాయక్‌, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులను తమ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వెల్లడించాయి. వీరిద్దరితో అహ్మద్‌ పటేల్‌ టచ్‌లో ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు