వచ్చే దీపావళికి రామ మందిరం పూర్తి!

16 Oct, 2017 17:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రామ జన్మభూమి.. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టి తీరతామని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి ప్రకటించారు. త్వరలో ఆటంకాలన్నీ తొలగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన... వచ్చే దీపావళి నాటికి గుడి నిర్మాణం పూర్తి చేసి తీరతామని చెబుతున్నారు. 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సుప్రీంలో ప్రస్తుతం రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అది పూర్తవ్వగానే రామ మందిర నిర్మాణ పనులు మొదలుపెడతాం. వచ్చే ఆగష్టు నుంచి పనులు మొదలుపెట్టి 3-4 నాలుగు నెలల్లో పూర్తి చేసి దీపావళి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం’ అని అన్నారు.    

కాగా, డిసెంబర్‌ 5న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో ఇరు వర్గాలు తుది వాదనలు వినిపించనున్నారు. ఆ మరుసటిరోజు అంటే డిసెంబర్‌ 6 నాటికి బాబ్రీ కూల్చివేత ఘటన జరిగి సరిగ్గా 26 ఏళ్లు పూర్తవుతుండటం విశేషం. 

స్వామి వాదన ఏంటంటే...

ఆ కాలంలో మొగలు చక్రవర్తి బాబర్‌ స్వాధీనంలో ఉండటంతో ఆ స్థలం తమకు చెందించే అని ముస్లిం నేతలు వాదిస్తున్నారు. కానీ, అలహాబాద్‌ హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే సమయంలో నేను లేవనెత్తిన అంశంపై కూడా వారి నుంచి సమాధానం రావటం లేదు. అది స్థిరాస్థి హక్కు అని వారు(ముస్లిం సంఘాలు) అంటున్నారు. కాబట్టి అదొక సాధారణ హక్కు అవుతుంది. కానీ, రామ జన్మభూమిపై హిందువులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయస్థానం గత తీర్పులో స్పష్టం చేసింది. ఆ లెక్కన్న వారు గెలిచే అవకాశాలు లేనే లేవన్నది స్పష్టమవుతోంది అని స్వామి చెబుతున్నారు

మరోవైపు ఆలయ నిర్మాణానికి తమకేం అభ్యంతరం లేదని.. కాకపోతే వివాదాస్పద స్థలానికి సహేతుక దూరంలో మసీదు నిర్మించాలంటూ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు