వరుస షాకులతో టీడీపీ విలవిల

22 Mar, 2019 02:05 IST|Sakshi

వైఎస్సార్‌సీపీలోకి  ఎస్వీ మోహన్‌రెడ్డి, కాండ్రు కమల

సాక్షి, అమరావతి: వరుస షాక్‌లు, పార్టీలో భగ్గుమంటున్న అసమ్మతితో తెలుగుదేశం పార్టీ విలవిల్లాడుతోంది. ఆ పార్టీ కీలక నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వారిని ఆపేందుకు టీడీపీ అధిష్టానం చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా కర్నూలు అర్బన్‌ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో టీడీపీ కంగుతింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఎస్వీ మోహన్‌రెడ్డికి చంద్రబాబు మళ్లీ సీటు ఇవ్వలేదు. చివరి వరకు డైలమాలో పెట్టి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ కుమారుడు భరత్‌కు కర్నూలు సీటు కేటాయించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేనైన తనకు సీటివ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీకి రాజీనామా చేసిన మోహన్‌రెడ్డి గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

మోహన్‌రెడ్డితో పాటు ఎస్వీ విజయ మనోహరి, పత్తికొండకు చెందిన ఐడీసీసీ మాజీ చైర్మన్‌ ఎస్‌.రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్‌.నాగరత్నమ్మలు కూడా పార్టీలో చేరారు. ఈ సమయంలో వారి వెంట నంద్యాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత గోపవరం సుధీర్‌రెడ్డి ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి దివంగత భూమా నాగిరెడ్డి ఒత్తిడితో టీడీపీలో చేరితే సీఎం చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని ఎస్వీ వెల్లడించారు. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా వైఎస్సార్‌సీపీలో చేరడంతో టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. చేనేత వర్గానికి చెందిన కాండ్రు కమలకు మంగళగిరి నియోజకవర్గంలో మంచి పట్టుంది. దీంతో ఇప్పటికే మంగళగిరిలో ఎదురీదుతున్న లోకేశ్‌కు మరింత గడ్డు పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.  

మరిన్ని వార్తలు