చింతమనేని ‘గప్‌చుప్‌’

14 Apr, 2019 11:51 IST|Sakshi

ఓటమి భయమా? వ్యూహాత్మకమా? 

బడేటి ‘బరితెగింపు’నకు కారణాలేంటి

చింతమనేని ‘గప్‌చుప్‌’ గుట్టేంటి

ఇద్దరు నేతల భిన్న వ్యవహార శైలిపై చర్చ 

పోల్‌ మేనేజ్‌మెంట్‌లో భాగమా.. గందరగోళమా

ఏలూరు టౌన్‌ : సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. ఆరు వారాల (42 రోజుల) నిరీక్షణ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇవన్నీ ఇకవైపు ఉంటే పోలింగ్‌ రోజు రాజకీయపార్టీలు విజయానికి వూహ్యాలు రచిస్తూ వాటిని అమలు చేసేందుకు కష్టపడ్డాయి.

జిల్లాలోనే వివాదాలకు పెట్టింది పేరైన దెందులూరు నియోజకవర్గంలో గొడవలు, దాడులు, అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండానే సాఫీగా సాగిపోగా.. అనూహ్యరీతిలో ఏలూరు నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాలపై దాడులకు తెగబడుతూ, తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోవటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే ఇద్దరు టీడీపీ నేతలు ఇలా వ్యవహరించారా? ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఇలా తమ వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించారా? అనే అంశాలపై ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టలుగా చెప్పుకునే టీడీపీ నేతలు ఇలా మారిపోవటం వెనుక అసలు కథ ఏంటనే అంశాలు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఇద్దరు నేతల తీరుపై టీడీపీ కేడర్‌లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

బడేటి ‘బరితెగింపు’
పోలింగ్‌ రోజు ఏలూరు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారశైలి వివాదాస్పదంగా మా రింది. గురువారం ఉదయం 7.30 గంటల నుంచే ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘర్షణలు, దాడులు, గొడవలు సృష్టిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఎ మ్మెల్యే బడేటి బుజ్జి తన వ్యవహారశైలికి భిన్నంగా ఎన్నికల్లో గొడవలు పెట్టుకోవటం చర్చనీయాం శంగా మారింది. ఏలూరులోని పలు పోలింగ్‌ బూత్‌ల వద్ద తన అనుచరులతో కలిసి దాడులకు తెగబడటం వెనుక కారణాలేమై ఉంటాయోనం టూ పలువురు చర్చిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ప్రశాంతంగా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళుతూ.. ప్రతి స్థానిక నాయకుడినీ కలుస్తూ వారి మద్దతు కూడగడుతూ విజయం సాధించే దిశగా అడుగులు వేసిన బడేటి.. ఇప్పుడు భిన్నంగా వ్య వహరించటాన్ని ఆ పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని), జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనా యుడు పోటీలో ఉన్నారు.

ఈ త్రిముఖ పోటీ నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బడేటి దుందుడుకు చర్యలకు పాల్పడటంపై కేడర్‌లోనే భిన్నస్వరాలు విని పిస్తున్నాయి. బడేటి దాడుల కారణంగా సొంత పార్టీలోని దళిత వర్గాలు, ఆర్యవైశ్యులు, ఇలా పలు సామాజికవర్గాల ఓట్లు గణనీయంగా చీలి పోయాయనీ, గెలిచే స్థితిలో నుంచి ఆత్మరక్షణలో పడ్దామంటూ ఆ పార్టీ నేతలే బాహాటంగా వ్యా ఖ్యానిస్తున్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
వైఎస్సార్‌ సీపీ నేతలే లక్ష్యంగా..
గత ఎన్నికల్లో రెడ్డి అప్పలనాయుడు, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ వంటి వారు కొండంత అండగా ఉంటూ నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులను సమన్వయం చేస్తూ టీడీపీ విజయానికి బాటలు వేసిన నేతలు ఇప్పు డు బడేటికి దూరం కావటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, పలువురు టీడీపీ స్థానిక నేతలు సైతం తనకు వ్యతిరేకంగా చాపకిందనీరులా పనిచేయటం, పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు  ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా చేతి వాటాన్ని ప్రదర్శించటం ఎమ్మెల్యే బడేటికి ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు. తనకు అడ్డువస్తే సహించలేని బడేటి ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చిన నేతలే టార్గెట్‌గా దాడులు చేశారనే అభిప్రాయమూ ఉంది.

ఓటమి భయంతోనే..
ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి రెచ్చిపోయి గొడవలకు దిగారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుందని ఆరోపణలు చేసే టీడీపీ నేతలు.. బడేటి బుజ్జి చేసిన దౌర్జన్యాలు, దాడులు, రౌడీయిజాన్ని ఏమంటారంటూ ఎదురుదాడికి దిగారు. ఐదేళ్లుగా ఏలూరు నియోజకవర్గంలో బడేటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని, మరోసారి తన నిజస్వరూపాన్ని పోలింగ్‌రోజు బయటపెట్టుకున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఓట్లు వేసేందుకు వెళ్లకుండా భయపెట్టడానికే ఇలా బడేటి బుజ్జి దాడులకు పాల్పడ్డారని, అయినా వైఎస్సార్‌ సీపీ నేతలు, కేడర్‌ వారి వ్యూహానికి కళ్లెం వేస్తూ ఎదురుదాడులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తపడ్డామని చెబుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే టీడీపీ నేతలు గొడవలు చేస్తూ ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు కుటిల యత్నాలు చేశారని అయినా అవేమి ఫలించలేదంటున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల నాని గెలుస్తారనే విశ్వాసం ఉందని.. బడేటి దాడులు, దౌర్జన్యాలతో తమ మెజారిటీని భారీగా పెంచేశారంటూ  ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గొడవలు వద్దంటూ హితవు
ఏలూరు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జి శనివారపుపేటలో దాడులు చేసిన సందర్భంలో అక్కడికి చింతమనేనిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా చింతమనేని తాను రానంటూ చెప్పటం, పట్టుబట్టి బడేటి అక్కడికి తీసుకువెళ్లినా.. తన శైలికి భిన్నంగా హడావుడి చేయకుండానే చింతమనేని వెనుదిరగటం పరిస్థితికి అద్దంపడుతోంది. టీడీపీ కేడర్‌కు సైతం ఏమీ గొడవలు పెట్టుకోవద్దనీ.. ప్రజలు తమపై వ్యతిరేకతతో ఉన్నారంటూ స్వయంగా చింతమనేని హితబోధలు చేయటం గమనార్హం. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకే ఇలా నటిస్తున్నారనీ.. అధికారం వస్తే రెచ్చిపోవటం ఆయనకు కొత్తేమీ కాదనే అభిప్రాయం ని యోజకవర్గ ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. మొత్తానికి చింతమనేనిలో మార్పు ఓట్లు కోస మో.. భయమో.. ఆందోళనో.. ఏదైనా కానీ.. చింతమనేని గమ్ముగా ఉంటూ ప్రజల ముందు సైలెంట్‌గా ఉన్నా ప్రజలెవరూ విశ్వసించలేదనేది బహిరంగ రహస్యం.  

చింతమనేని ‘గప్‌చుప్‌’ ఆంతర్యమేంటీ 

చింతమనేని.. ఈ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. గొడవలు, దౌర్జన్యాలు, దాడులు, వివాదాలే. పోలీసు అధికారులు, రెవెన్యూ, దళితులు, సామాన్యులు, వికలాంగులు, రాజకీయ నేతలు ఇలా ఒక్కరేమిటీ అన్నివర్గాల వారూ చింతమనేని చేతుల్లో దాడికి గురైనవారే. దెందులూరు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోవటం, కొట్టటం, తీవ్ర పదజాలంతో దూషణలకు దిగటం పరిపాటిగా మారింది. అయితే ఆయనకు ఏమయ్యిందో ఏమో గానీ తన స్వభావానికి భిన్నంగా మారిపోయారు.

ఎవరైనా ఎదురు మాట్లాడితే రెండో కాలిపై.. అంతెత్తునలేస్తూ గొడవలు చేసే చింతమనేని.. ఓడిపోతాననే ‘చింత’తో సతమతమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్‌ రోజు సైతం చింతమనేని నియోజకవర్గంలో నోరెత్తిన పాపానపోలేదంటున్నారు. ఆఖరికి తమకు అనుకూలంగా ఉండే ఒక వర్గంపై దాడి జరిగిందని తెలిసినా ఏమాత్రం రెచ్చిపోకుండా తన వ్యవహారశైలికి భిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. చింతమనేనిపై 2010 నుంచి దెందులూరు, పెదవేగి, పెదపాడు, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, గన్నవరం, భీమడోలు తదితర ప్రాంతాల్లో ఏకంగా 26 కేసులు ఉండగా, ఒక కేసుల్లో రెండేళ్ల జైలు కూడా పడింది. ఇలా వివాదాలకు ఆద్యుడుగా పేరొందిన చింతమనేని ఈనెల 11న పోలింగ్‌ రోజు గప్‌చుప్‌గా మారిపోవటం, హల్‌చల్‌ చేయకుండా బుద్ధిమంతుడిలా వ్యవహరించటంపై చర్చసాగుతోంది.

పతనానికి పలు కారణాలు
నియోజకవర్గంలో తన సొంత సామాజికవర్గం సైతం ఎన్నికల్లో మద్దతుకు ససేమిరా అంటూ తెగేసి చెప్పేయటం, ప్రధానంగా పట్టున్న గ్రామాల్లో కూడా ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బాహాటంగా మద్దతు తెలపటం చింతమనేనికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని పోటీ చేయగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బీసీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు చివరి దశలో పోటీకి వచ్చారు. అప్పటివరకూ సొంత సామాజికవర్గంలోని అసంతృప్తి ఉన్నా.. ఎన్నికల నాటికి తమవాడే కదా అనే ధోరణిలో చింతమనేని వైపే మొగ్గుచూపారు.

కానీ 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేకపోవటం, సొంత సామాజికవర్గంలోని స్థానిక నేతలు, ఆయా గ్రామాల్లో బాగా పట్టున్న నాయకులు, దళితులు, బీసీలు వైఎస్సార్‌ సీపీకి జై కొట్టటం చింతమనేని వ్యవహారశైలిలో మార్పులు తెచ్చాయి. కొప్పాక సొసైటీ అధ్యక్షుడు చల్లగొళ్ల వెంకటేశ్వరరావు (భూస్వామి), పర్వతనేని జగన్మోహనరావు, మోరు రామరాజు, పోకల రాంబాబు, దోసపాడు టీడీపీ ఎంపీటీసీ ఎస్‌.సుధాకర్, దెందులూరు మండల కాపు సంఘం అధ్యక్షులు కొండేటి గంగాధరబాబు వంటి నేతలు చింతమనేనితో విసిగిపోయి మరీ కొఠారు పక్షాన నిలవటం చింతమనేనికి ఓటమి కళ్లముందే కనిపించింది. చింతమనేని పేరు చెబితేనే బయటకు రావటానికి సాహసం చేయని నియోజకవర్గ ప్రజలు దెందులూరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి నామినేషన్‌కు వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావడం, పలు సందర్భంగా యువత, ప్రజలు పెద్దెత్తున ఆయన వెంట కదలిరావడం చింతమనేని పతనానికి నిదర్శనాలుగా మారాయి.

మరిన్ని వార్తలు