పదవులు.. అలకలు

23 Apr, 2018 06:43 IST|Sakshi

 జిల్లా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు

టీటీడీ మెంబర్‌ ఇచ్చి అవమానించారంటూ రాయపాటి వర్గం మండిపాటు  

మిర్చియార్డు చైర్మన్‌ పదవి దక్కక అసంతృప్తిలో వెన్నా వర్గం

జిల్లా టీడీపీలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. పార్టీ పదవుల నుంచి నామినేటెడ్‌ పోస్టుల నియామకాల్లో సీనియర్‌లకు తగిన గుర్తింపు రావడం లేదని ఆయా వర్గాలు రగిలిపోతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జిల్లాలో మార్కెట్‌ యార్డు పదవుల నుంచి నామినేటెడ్‌ పోస్టుల వరకు ఛాన్స్‌ దక్కకపోవడంతో టీడీపీ సీనియర్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీడీ చైర్మన్‌ పదవిని ఆశించగా కేవలం మెంబర్‌తో సరిపెట్టడం ఆ వర్గాన్ని తీవ్ర అసహనానికి గురి చేసింది.  

సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వ్యవధిలో జిల్లాలో సీనియర్‌ తలకు పదవులు ఇవ్వకుండా విస్మరించడంపై వారి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. కొందరు తూతూమంత్రంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మరి కొందరు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి పదవులను ఆశించిన అనేక మంది ద్వితీయ శ్రేణి సీనియర్‌ టీడీపీ నేతలు తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ ముఖ్యనేతల వద్ద ప్రస్తావించి తమ ఆవేదనను వెళ్ళగక్కగా మరికొందరు తమ వర్గీయులతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించేందుకు సంసిద్ధమవుతున్నారు.

ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం
జిల్లా టీడీపీలో ఓ సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సీనియర్లను సైతం పక్కన పెడుతున్నారని ఇతర సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఐదు సార్లు లోక్‌సభకు, ఒక సారి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు టీటీడీ చైర్మన్‌ పోస్టు కావాలని అడగ్గా.. కేవలం బోర్డు మెంబర్‌గా నియమించడంపై తీవ్ర అసహనం వ్యక్తం            చేస్తున్నారు.

గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా ఉన్న మన్నవ సుబ్బారావు పదవీ కాలం ముగిసినప్పటికీ రెండు సార్లు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారే తప్ప.. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వెన్నా సాంబశివారెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నమ్ముకుని కుటుంబ పరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన సాంబశివారెడ్డిని అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం తగదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాయకులను నిలదీస్తున్న వైనం
మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పదవుల నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవిని నిలదీసిన విషయం తెలిసిందే. అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిని నియమించి కోడెల తనయుడు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటూ ఆ పార్టీ మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డితోపాటు పలువురు అసమ్మతి నేతలు నిరాహార దీక్షకు దిగారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపుపై పార్టీలో అసమ్మతి పెరిగిపోతుందనే సంకేతాలు వస్తుండటంతో ఆ పార్టీ ముఖ్యనేతల గుండెల్లో కలవరం మొదలైంది.

మరిన్ని వార్తలు