టీడీపీ నేతల హల్‌చల్‌

9 Apr, 2018 07:43 IST|Sakshi
కోట్లు కబ్జాలపై వెలిసిన వాల్‌పోస్టరు

గొల్లపూడి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా జాతీయ రహదారి దిగ్బంధం

భారీగా స్తంభించిన ట్రాఫిక్‌ .. నిర్వాహకులపై పోలీసు కేసు

విజయవాడ : గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై హల్‌చల్‌ చేశారు. బైక్‌ ర్యాలీకి పోలీసులు అనుమతించకున్నా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాంతో విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై రామవరప్పాడు రింగ్‌ వద్ద సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో నగరంలోని బెంజి సర్కిల్, ఐదో నంబర్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహన చోదకులు ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొన్నారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేకున్నా ప్రజలకు ఇబ్బంది కల్గించే విధంగా టీడీపీ కార్యకర్తలు ఎన్‌హెచ్‌పై నానా హంగామా చేశారు. బైక్‌లకు సైలైన్సర్లు ఊడపీకి ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపై స్వైర విహారం చేశారు. ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు మీదుగా సాగిన ర్యాలీలో యువకులు బైక్‌లపై భీతావహం సృష్టించారు. రోడ్లపై వెళ్లే ఇతర వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా పోలీసు ఉన్నతాధికారులు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.

కలకలం రేపిన పోస్టర్లు..
గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) కబ్జాలు చేశారని కరపత్రాలు ముద్రించి గోడలకు అంటించారు. ఆయన ఏఎంసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం సాయంత్రం తరలి వెళుతుండగా ఉదయం పూట ప్రసాదంపాడు, రామవరప్పాడు, ఎనికేపాడులో కరపత్రాలు గోడలకు అంటించి ఉన్నాయి. కరపత్రాలు, పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కబ్జాకోరుకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఇవ్వటం దురదృష్టకరమని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కరపత్రాలపై కోట్లుపై నమోదైన క్రిమినల్‌ కేసులు క్రైమ్‌ నంబర్లతో సహా ప్రచురించి అవి విచారణలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై 6 క్రిమినల్‌ కేసులు విచారణలో ఉన్నట్లు అందులో వివరించారు.

విజయవాడ  8వ నెంబర్‌ కోర్టులో కోట్లుపై క్రిమినల్‌ కేసు రివిజన్‌ పిటీషన్‌ నెం.85/2015లో విచారణ ఎదుర్కొంటున్నారు.
రామవరప్పాడులో పాపయ్య డొంక రోడ్డులో సర్వే నెంబర్‌93/1, 93/సిలోని 1.56 ఎకరాల స్థలం తన అనుచరులతో దౌర్జన్యంగా కబ్జా చేసినట్లు ఆరోపించారు.
కోట్లు అనుచరులు నున్న, సూరంపల్లి, ఆగిరపల్లి, మర్లపాలెం, ప్రసాదంపాడులో కబ్జాలకు పాల్పడినట్లు ఆ కరపత్రంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు