మోదీ, జైట్లీతో టీడీపీ ఎంపీలు.. రివర్స్‌సీన్‌!

27 Mar, 2018 12:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..’ అంటూ టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు చేసిన నిర్దేశం​ దిశ మారింది! బాబు సూచనకు సరిగ్గా రివర్స్‌సీన్‌ నేడు పార్లమెంట్‌ ఆవరణలో చోటుచేసుకుంది. సర్వత్రా ఆసక్తిరేపిన ఆ దృశ్యాల వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్‌సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నేడు లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇవాళ పార్లమెంట్‌కు వచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మోదీ సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ అటుగా వెళ్లారు. ఆ ఇద్దరు పెద్దలతో ఎంపీలు చర్చ జరిపే ప్రయత్నం చేశారు. ఒక దశలో సుజనా.. జైట్లీ చేతులు పట్టుకుని మరీ ఏవేవో వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానికి కూడా నమస్కారం పెట్టారు. ఆసక్తికరమైన ఈ దృశ్యాలపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
(చదవండి: నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..)

నిలదీయమంటే ఇదేంది?: మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఆదేశించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తనపై నిందలు వేయడాన్ని నిలదీయమన్నారు. బాబు ఘాటు సూచనల వార్తలు అన్ని జాతీయ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. అయితే ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం పార్లమెంట్‌ ఆవరణలో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు