కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

25 Jul, 2019 10:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడవుతోంది. చంద్రబాబు నిర్ణయంపై అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శాసనసభలో తమను వాడుకుని కీలక పదవిని మాత్రం కేశవ్‌కు కట్టబెట్టడంపై వీరంతా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

చంద్రబాబు నిర్ణయంతో వెంటనే కేశవ్‌ బుధవారం అసెంబ్లీలో నామినేషన్‌ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కేశవ్, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, గణబాబు తదితరులు ఈ పదవి ఆశించినా చంద్రబాబు కేశవ్‌వైపే మొగ్గు చూపారు. కేశవ్‌తో పాటు గంటా శ్రీనివాసరావు పేరును పరిశీలించారు. కానీ గంటా పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో కేశవ్‌ను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. కేశవ్‌ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో బీసీ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉంటుందని తొలుత ప్రచారం సాగింది. కానీ చివరకు చంద్రబాబు కేశవ్‌ పేరునే ఈ పదవికి ఖరారు చేశారు.  

మరిన్ని వార్తలు