‘దుష్యంత్‌ చౌతాలా నన్ను మోసం చేశారు’

26 Oct, 2019 12:11 IST|Sakshi

చండీగఢ్‌ : జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్‌ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్‌లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్‌మేకర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి. అనేక పరిణామాల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతునిస్తున్నట్లు జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ప్రకటించారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఇక జేజేపీ అండతో మరోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ.. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. (చదవండి : హరియాణాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే)

ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌పై జేజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజ్‌ బహదూర్‌ దుష్యంత్‌ తీరుపై మండిపడ్డారు. ‘దుష్యంత్‌ చౌతాలా నాతో పాటు హరియాణా ప్రజలను ఘోరంగా మోసం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీకి మద్దతునిచ్చారు. బీజేపీని రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తొలగించాలంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇక 2017లో భారత జవాన్లకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన తేజ్‌ బహదూర్‌ను భారత భద్రతా దళం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ(ఉత్తరప్రదేశ్‌)లో చేరిన ఆయన... 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ మహాకూటమి(బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్డీ) అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరులో జేజేపీలో చేరి ఎమ్మెల్యే టికెట్‌ సంపాదించారు. కర్నాల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మనోహర్‌లాల్‌పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా