నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..  

7 Sep, 2023 21:28 IST|Sakshi

చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.  

హర్యానా  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు.  వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. 

ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. 

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది.                

ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్

మరిన్ని వార్తలు