ఓటెత్తిన చైతన్యం

11 May, 2019 07:56 IST|Sakshi
ఓటు వేయడానికి వేచి ఉన్న మహళలు

కరీంనగర్‌: జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల తుది దశ సమరం ప్రశాంతంగా ముగిసింది. మండే ఎండ సైతం పల్లె ఓటర్ల చైతన్యం ముందు చల్లబడింది. ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. 44 డిగ్రీల వేడితో భగభగమంటున్న భానుడి ప్రతాపాన్ని లెక్క చేయకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మలిదశ పోరులో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద యువత, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే ఓటు వేసేందుకు రావడం కనిపించింది. మరోవైపు అభ్యర్థులు కూడా ఓటర్లను రప్పించుకునే ఏర్పాట్లు చేయడం, పలు వాహనాల్లో వారిని కేంద్రాలకు చేరవేయడం వంటి సదుపాయాలతో ఓటింగ్‌ శాతం పెంచుకోగలిగారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని చోట్ల  ఓటర్లు ముందస్తుగానే ఉదయం వేళ ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఇతర పనులకు వెళ్లాల్సిన వారు, వృద్ధులు, ఉపాధి కూలీలు ముందుగానే ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. వృద్ధులను ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తీసుకువచ్చారు. జిల్లాలోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 88 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు 73.54 శాతం నమోదైంది. చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, రామడుగు, తిమ్మాపూర్‌ మండలాల్లో పోలింగ్‌ జరుగగా అత్యధికంగా గన్నేరువరం మండలంలో 79.68 శాతం, ద్వితీయ స్థానంలో చొప్పదండి మండలం 75.96 శాతం, కరీంనగర్‌రూరల్‌ మండలంలో 69.35 శాతం అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది.

మండలాల వారీగా పోలింగ్‌..
ఎనిమిది జెడ్పీటీసీ, 88 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన పోరులో చిగురుమామిడి మండలంలో 75.73 శాతం, చొప్పదండి మండలంలో 75.96 శాతం, గంగాధరలో 71.66 శాతం, గన్నేరువరంలో 79.68 శాతం, కరీంనగర్‌రూరల్‌లో 69.35శాతం, కొత్తపల్లిలో 69.65 శాతం, రామడుగులో 74.06 శాతం, తిమ్మాపూర్‌ మండలంలో 75.34 శాతం పోలింగ్‌ నమోదైంది.
 
ఉన్నతాధికారుల సందర్శన..
పరిషత్‌ పోరు సరళిని జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలను సందర్శించి ఓటింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సాధారణ పరిశీలకులు శర్మన్, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్‌వో భిక్షానాయక్, ఆర్‌డీవో ఆనంద్‌కుమార్, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, ఆయా విభాగాల అధికారులు మండల కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు.

ఓటేసిన ప్రముఖలు...
పరిషత్‌ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బూర్గుపల్లి గ్రామంలో ఓటు వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చిగురుమామిడి మండలం రేకొండలో ఓటేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి చిగురుమామిడి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి చొప్పదండి మండలం మంగళపల్లిలో ఓటు వేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తన స్వగ్రామమైన ఒగులాపూర్‌లో ఓటు వేశారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్‌ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరిన్ని వార్తలు