లెక్క తేలింది

3 May, 2019 12:55 IST|Sakshi
కౌడిపల్లిలో మహ్మద్‌నగర్‌ ఎంపీటీసీ సునీతకు బీఫాం అందజేస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

మెదక్‌ రూరల్‌: ప్రాదేశిక ఎన్నికల సమరం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మూడు విడతల్లో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో తుది అంకం పూర్తి అయ్యింది. గురువారం తుది విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి రోజు కొనసాగింది. ఇప్పటికే తొలి, రెండు విడుతల నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, గురువారం రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొదటి, రెండో విడతలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

మొదటి విడుతలో హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 65 ఎంపీటీసీ స్థానాలకు గాను పెద్దశంకరంపేట మండలం జూకల్‌ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమవగా, మిగితా 64 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 190 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆరు జెడ్పీటీసీ స్థానాలకు గాను మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 60 ఎంపీటీసీ స్థానాలకు గాను 205 మంది బరిలో నిలిచారు. మొదటి విడత పోలింగ్‌ ఈనెల 6న జరుగనుండగా, రెండో విడత పోలింగ్‌ ఈనెల 10న, మూడో విడత పోలింగ్‌ ఈనెల 14న జరగనుంది. ఇప్పటికే మొదటి విడత మండలాల్లో వ్యూహప్రతివ్యూహాలతో అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తుండగా, రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో బుజ్జగింపుల పర్వం షురూ అయ్యింది. ఇక చివరి విడత నామినేషన్లు పూర్తి కావడంతో కొందరు బీఫాంల కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎన్నికల ప్రణాళికను రూపొందించుకుంటున్నారు.

ఇక ప్రచారమే తరువాయి
రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారంతో ముగిసింది. నర్సాపూర్,  చిలప్‌చెడ్,కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60 ఎంపీటీసీ స్థానాలకు గాను 205 మంది పోటీలో ఉన్నారు. శివ్వంపేట మండలం చండీ ఎంపీటీసీ స్థానంలో బరోవత్‌ లక్ష్మి ఏకగ్రీవమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాంలను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించడం జరిగింది.
 
తుది అంకం పూర్తి..
ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం చివరి రోజు ముగిసింది. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్‌ మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలకు గాను 60మంది అభ్యర్థులు 72 నామినేషన్లను వేశారు. ఇందులో బీజేపీ(9), కాంగ్రెస్‌(20), టీఆర్‌ఎస్‌(33), టీడీపీ(2), గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించి (5), స్వతంత్ర అభ్యర్థులు(3) నామినేషన్లను వేశారు. 64 ఎంపీటీసీ స్థానాలకు గాను 370 మంది అభ్యర్థులు 420 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ(48), కాంగ్రెస్‌(111), టీఆర్‌ఎస్‌(214), గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధిచి (1), స్వతంత్ర అభ్యర్థులు(46) నామినేషన్లను వేశారు.

మరిన్ని వార్తలు