వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు ప్రమాణం

23 Jul, 2020 04:28 IST|Sakshi

ఆళ్ల, మోపిదేవి, బోస్‌ ప్రమాణ స్వీకారం 

ఎంబీసీలకు తొలిసారిగా రాజ్యసభకు అవకాశం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్‌ సీపీ సభ్యుల్లో ముగ్గురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్షర క్రమం ప్రకారం తొలుత ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణం చేయగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి.. వారితో పాటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలసి  ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 

ఇది ఒక రికార్డు: మిథున్‌రెడ్డి
మరీ వెనుకబడిన తరగతి (ఎంబీసీ)కి చెందినవారు ప్రప్రథమంగా రాజ్యసభలో అడుగుపెట్టడం రికార్డు అని, వైఎస్సార్‌ సీపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాజ్యసభలో ఒక్క సభ్యుడితో మొదలైన వైఎస్సార్‌ సీపీ ప్రస్థానం ఈరోజు ఆరుకి పెరిగింది. ఈ పరిణామం రాష్ట్రానికి మరింత మేలు చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ చలువతో బీసీల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటగా రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. అనారోగ్య కారణాల వల్ల పరిమళ్‌ నత్వానీ ప్రమాణ స్వీకారం చేయలేదు. వచ్చే వారం ఆయనకు సమయం ఇవ్వాలని పార్టీ ద్వారా రాజ్యసభ చైర్మన్‌ను కోరాం..’ అని తెలిపారు.
బోస్, మోపిదేవి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు(కుడి నుంచి ఎడమకు) 

కలలోనూ ఊహించలేదు
– సుభాష్‌ చంద్రబోస్‌
‘మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ తరగతులకు చెందిన నాకు, మోపిదేవికి పార్లమెంట్‌  సభ్యులుగా అవకాశం దక్కడం అరుదు. కలలో కూడా ఊహించనిది జరిగింది. ఇలాంటి మహత్తర అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మాపై గురుతరమైన బాధ్యత ఉంది. విభజన హామీలన్నీ ఇంకా అమలు కాలేదు. కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇక్కట్లలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సి ఉంది. ప్రధాని ఈ దిశగా సాయం చేస్తారని ఆశిస్తున్నాం..’ అని బోస్‌ అన్నారు. 

నాలుగు రంగాలపై దృష్టి : ఆళ్ల 
‘ముఖ్యమంత్రి జగన్‌ మాపై ఎంతో నమ్మకంతో పెద్దల సభకు ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ పురోగమించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి ప్రాధామ్యాలకు అనుగుణంగా పనిచేస్తాం..’ అని ఆళ్ల చెప్పారు.  

అరుదైన ఘటన: మోపిదేవి
‘నా రాజకీయ జీవితంలో ఇది మరువలేనిఘటన. విశాల రాజకీయ దృక్పథంతో పరిణితి చెందిన నేతలను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్న  సీఎం వైఎస్‌ జగన్‌ విధానాలకు అనుగుణంగా పనిచేస్తాం. అత్యంత వెనకబడిన కులాలకు చెందిన ఇద్దరికి రాజ్యసభలో ప్రవేశించే అవకాశం కల్పించడం ఏపీ చరిత్రలోనూ, ప్రాంతీయ పార్టీల ప్రస్థానంలో ఒక అరుదైన ఘటన. బీసీ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అని మోపిదేవి  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు