మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభకు తరలిరండి

4 Mar, 2018 05:26 IST|Sakshi

ప్రజలకు కోదండరామ్‌ పిలుపు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సభకు భారీగా తరలిరావాలని ప్రజలకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై శనివారం ఇక్కడి మఖ్దూం భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వానికి గుర్తుచేసేందుకే స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నామన్నారు.

ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని మూడేళ్లు ఎదురు చూశామని, కానీ వాటిని పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మిలియన్‌ మార్చ్‌ చారిత్రక ఘట్టమని, విద్యార్థులు ఉద్యమంలో దెబ్బలు తిని జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ మాట్లాడుతూ మిలియన్‌ మార్చ్‌లో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. జిల్లాల్లో మిలియన్‌ మార్చ్‌కు స్ఫూర్తిగా అమరుల విగ్రహాల వద్ద స్ఫూర్తి సభలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కూడా స్ఫూర్తి సభలో పాల్గొన వచ్చన్నారు.

మరిన్ని వార్తలు