Sakshi News home page

వారంతా కాంగ్రెస్‌ నిరంకుశంపై పోరాడిన వాళ్లే.. 

Published Sun, Oct 22 2023 2:14 AM

Cheruku Sudhakar from Nalgonda joins BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నిరంకుశ విధానాలపై పోరాడిన వాళ్లంతా ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరుతు న్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ విధానాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో చెరుకు సుధాకర్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరే కంగా 46 రోజులు పోరాటం చేసి జైలు శిక్ష అనుభ వించిన నాయకులు చెరుకు సుధాకర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడం శుభ పరిణామమన్నారు.

జిట్టా బాలకృష్ణ, ఏపూరి సోమన్న, హర్‌దీప్‌రెడ్డి లాంటి వాళ్లు బీఆర్‌ ఎస్‌లో చేరడం గొప్ప విషయమని, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ‘అదృష్టం ఉంటేనే ఇంట్లో ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. మనింటి అమ్మాయిని వేరే వాళ్లకు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో, రాష్ట్రాన్ని ఒకరి చేతిలో పెట్టాలంటే కూడా ఎంతో ఆలోచించాలి. ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంచాలో ప్రజలు కూడా ఆలోచించాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ సీఎంగా అవకాశమివ్వాలని విన్నవించారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండుకు 12 అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ గెలవాలి. ఈ చేరికలతో నకిరేకల్‌లో లింగయ్య, ఆలేరులో సునీత గెలుపు ఖాయమ య్యాయి. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఈసారి దసరాకు ఊళ్లలో అభివృద్ధిపైనే చర్చ జరగాలి’ అని కేటీఆర్‌ చెప్పారు. 

దూకుడుగా పని చేస్తాను: చెరుకు సుధాకర్‌ 
‘తెలంగాణ ఉద్యమాన్ని గరిష్ట స్థాయిలో నడిపాను. జైలు జీవితాన్ని కూడా గడిపాను. నా ఆలోచన విధానానికి పదును పెట్టింది తెలంగాణ భవన్‌. పార్లమెంటరీ రాజకీయాలను అవగాహన చేయించిన వ్యక్తి కేసీఆర్‌. తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా బీఆర్‌ఎస్‌ కొనసాగాలి. తెలంగాణ ప్రజలకు అనేక పాఠాలు, వ్యతిరేకులకు గుణపాఠాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్‌. భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా పార్టీ నిలవాలి. ప్రజలకు మరింత చేరువై అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజల ఆశయా లు, ఆకాంక్షల సాధన కోసం గతంలో మాదిరిగానే దూకుడుగా పని చేస్తాను’ అని చెరుకు సుధాకర్‌ చెప్పారు.  

రాహుల్, రేవంత్‌ డీఎన్‌ఏలు మ్యాచ్‌ కావట్లేదుమంత్రి హరీశ్‌రావు
చెరుకు సుధాకర్‌ కరుడుగట్టిన ఉద్యమవాది అని, తెలంగాణ ఉద్యమంలో మొదటగా జైలుకెళ్లిన వ్యక్తి ఆయనే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్‌ రెడ్డి ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయని కిషన్‌రెడ్డి మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. బీజేపీతో పోరాటం తమ డీఎన్‌ఏలో ఉందని రాహుల్‌ గాంధీ అన్నారని, మరి రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏలో ఏముందో చెప్పాలన్నారు.

రాహుల్, రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏలు సరిపోలడం లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 35–40 స్థానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, సోనియమ్మ ను బలి దేవత అన్న రేవంత్‌ ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. రాహుల్‌ కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటని, కాంగ్రెస్‌కు లెహర్‌ లేదని జహర్‌ మాత్రమే ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటున్నారని, కానీ రాష్ట్రంలో ప్రతి గింజనూ సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేశారని చెప్పారు. పనితనం తప్ప, పగతనం లేని నాయకుడు కేసీఆర్‌ అని, కేసీఆర్‌కు ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని, కాంగ్రెస్‌ అంటే మాటలు, మంటలు, ముఠాలు అని అభివర్ణించారు.

Advertisement

What’s your opinion

Advertisement