ఏ పల్లె చూసినా దైన్యమే

24 Oct, 2018 04:16 IST|Sakshi

     ఎటుచూసినా జ్వర పీడితులే 

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన గిరిజనులు 

     వైద్యం పడకేసిందని ఆవేదన.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం 

     అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత  

     మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని మెరుగు పరిచి ఆదుకుంటామని భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అసలే ఆదివాసీలు.. కొండ ప్రాంతాలు. నాగరిక ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టున్న ఊళ్లు. రోడ్లు లేవు. రక్షిత మంచినీటి పథకాలు లేవు. రవాణా సౌకర్యం లేదు. అలంకార ప్రాయంగా కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా డాక్టర్లు ఉండరు. ఆయాలు, కాంపౌండర్లే అక్కడ చేయి తిరిగిన వైద్యులు. అన్ని రోగాలకూ ఒకటే మందు.. ఉంటే పారాసిట్మాల్‌ లేదా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు. ఊరూరా జ్వరాలు, జనం చస్తున్నా పట్టించుకోని పాలకులు. దీనికి తగ్గట్టు జనం మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకునే భూత వైద్యులు.. ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు అందిన ఫిర్యాదులివి. పార్టీ పక్షపాతంతో ఇళ్లు, పింఛన్లు ఇవ్వని కేసులు, జన్మభూమి కమిటీల ఆగడాలు సరేసరి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 292వ రోజు మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు గిరిజన నియోజకవర్గంలో సాగింది. ఆద్యంతం గిరిజనులు పెద్ద ఎత్తున తమ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య స్థితి గతులను జగన్‌కు వివరించారు. ఓ వైపు కష్టాలు చెప్పుకుంటూనే మరోవైపు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. కోయ నృత్యాలు, కొమ్ము బూరలు, కోలాటాలు, మేళతాళాలతో హోరెత్తించారు.  


 
కరాసవలస చావులకు ప్రభుత్వానిదే బాధ్యత.. 
కరాసవలస.. సాలూరు నియోజకవర్గంలోని ఓ గ్రామం. 250 కుటుంబాల దాకా ఉంటాయి. ఇటీవలి కాలంలో వార్తల్లోకి ఎక్కిన గ్రామం ఇది. నెల రోజుల వ్యవధిలో 11 మందిని విష జ్వరాలు పొట్టన పెట్టుకున్నాయి. ఇప్పటికీ అనేక మంది వివిధ రకాల రుగ్మతలతో బాధ పడుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్‌ ఎదుట బాధితులు బావురుమన్నారు. ఎవరైనా మహిళ కాన్పుకు వెళ్లాలంటే భయమేస్తోందని, తమ ఊళ్లకు అంబులెన్స్‌ రావడానికి రహదారి సౌకర్యం లేదని, డెంగీ జ్వరం వచ్చినా తమ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలలో పట్టించుకోరని వాపోయారు. కరాసవలసలో చావులు, బాగు వలసలో ఓ బాలింత మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని జగన్‌కు విన్నవించారు. తమ ఎమ్మెల్యే రాజన్న దొర వచ్చేంత వరకు తమను పట్టించుకోలేదని వారు వివరించారు.  

ఖరీదైన జబ్బులు మాకే రావాలా సార్‌.. 
సాలూరు పట్టణానికి చెందిన వెంకటేశ్‌ వయస్సు 32 ఏళ్లు. కూటికి పేదవాడే అయినా గుణానికి కాదన్న రీతిలో అందరికీ ఆదర్శంగా నిలవాలని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్న దశలో వెంకటేశ్‌ మూత్రపిండాల వ్యాధి బారినపడ్డాడు. వారానికి రూ.800 మందులు, నెలకు మూడు నాలుగు సార్లు డయాలసిన్, మధ్యమధ్యలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొనుగోలు.. ఇతరత్రా కలిసి నెలకు రూ.14 వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని, తన భర్తను కాపాడి తమ పిల్లలకు దారి చూపండంటూ వెంకటేశ్‌ భార్య జగన్‌ను కలిసి కన్నీళ్ల పర్యంతమైంది. ఇంత ఖరీదైన జబ్బులు తమ లాంటి పేదవాళ్లకే రావాలా సార్‌.. అంటూ కుమిలిపోయింది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న సాలూరుకు చెందిన 12 ఏళ్ల సత్రపు పూజితతో కలిసి వాళ్ల పెద్దమ్మ వరలక్ష్మి జగన్‌ను కలిసి తన ఇక్కట్లను ఏకరవుపెట్టింది. వివిధ ఆస్పత్రులకు తీసుకువెళ్లినా నయం కాలేదని, కూలి పనులు చేసుకునే పూజిత తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టలేరని తెలిపింది.

ఈ పాపను కాపాడాలని ప్రాదేయపడింది. ఇలా ఒకటా రెండా.. అభాగ్యులు అనేక మంది జగన్‌ను కలిసి గుండెల్ని పిండేసే తమ ఆరోగ్య సమస్యలను జగన్‌కు విన్నవించారు. పాచిపెంట మండలం మోసూరుకు చెందిన దుర్గాప్రసాద్‌కు పక్షవాతం వచ్చి మంచాన పడితే ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయలేమని డాక్టర్లు చెప్పినట్టు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వమే ఉచితంగా కళ్ల వైద్యం చేయించాలని నరసమ్మ అనే వృద్ధురాలు కోరింది. ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. వీటిపై జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే వేయి రూపాయల ఖర్చు దాటిన ప్రతి వ్యాధినీ ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఆదుకుంటామని హామి ఇచ్చారు. 6 నెలలు ఓపిక పట్టండని చెప్పారు.

  
 
విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పోరుకు మద్దతు... 
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఈనెల 26 నుంచి చేపట్టిన దశల వారీ ఆందోళనకు వైఎస్‌ జగన్‌ మద్దతు ప్రకటించారు. ఏపీ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం నేతలు జి.రామకృష్ణ, జి. మురళీ, జి.సురేష్‌ కుమార్‌ తదితరుల కోరిక మేరకు జగన్‌ వారి పోరుబాట పోస్టర్‌ను పాదయాత్రలో ఆవిష్కరించారు. ఈనెల 26న తిరుపతిలో దీక్ష, వచ్చేనెల 5న విశాఖపట్నంలో ధర్నా, వచ్చే నెల 19 నుంచి 22 వరకు కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ నుంచి అమరావతి వరకు పాదయాత్ర, అంతిమంగా డిసెంబర్‌ 9న ఆమరణ దీక్ష చేస్తామని వారు జగన్‌కు వివరించారు. మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు కూడా జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రోజంతా పత్తి తీసినా వందకు మించి కూలి రావడం లేదని పలువురు వ్యవసాయ కూలీలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. కూర్మరాజుపేట ప్రాంతానికి సాగు నీరు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆ గ్రామానికి చెందిన మహిళా రైతులు పల్లా అప్పలనరసమ్మ, మంగమ్మ, మాలతి తదితరులు జగన్‌ను కోరారు.  

 
 
మమ్మల్ని రెగ్యులర్‌ చేయడం లేదు.. 
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 16 ఏళ్లపాటు సేవలందించిన తమను రెగ్యులర్‌ చేసేలా చూడాలని 1900 మంది కాంట్రాక్టు టీచర్లు, సిబ్బంది వైఎస్‌ జగన్‌ను కోరారు. ప్రభుత్వం అడ్డగోలుగా వేటు వేస్తుండటంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని టీచర్ల ప్రతినిధులు గణపతి, త్రినాధరావు తదితరులు వైఎస్‌ జగన్‌ను కలసి అర్థించారు. తాము రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానమైన అర్హతలతో వారితో సమానంగా బోధనా పనులు నిర్వర్తిస్తున్నా, తమను రెగ్యులర్‌ చేయకుండా ప్రభుత్వం వేధిస్తోందని వాపోయారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 800 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా 2500 పోస్టులు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం డీఎస్సీ రాయడానికి కూడా తమలో చాలా మందికి వయోపరిమితి మించిపోయిందని వాపోయారు.   

>
మరిన్ని వార్తలు