టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

12 Mar, 2020 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్‌ నాయకులు కే కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కేకేకు కేసీఆర్‌ మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న సురేష్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. 

గత కొద్దిరోజులుగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే దానిపై తీవ్ర చర్చ సాగింది. ఒక స్థానానికి కేశవరావు పేరును ఖరారు చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే మరో స్థానానికి సీఎం కేసీఆర్‌ ఎవరిని నామినేట్‌ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్‌ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. అయితే చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌.. కేకే, సురేష్‌రెడ్డి పేర్లను రాజ్యసభకు నామినేట్‌ చేశారు.

మరిన్ని వార్తలు