నోరు విప్పిన డీఎస్‌; కేసీఆర్‌ కోర్టులో బంతి!

27 Jun, 2018 18:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో తన పాత్ర చుట్టూ చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపై ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) ఎట్టకేలకు నోరు విప్పారు. జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని, క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తనను కలిసిన విలేకరులతో ‘‘నో కామెంట్‌.. నన్నేమీ అడగొద్దు..’’ అన్న డీఎస్‌... సాయంత్రానికి హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె.చంద్రశేఖర్‌రావును డీఎస్‌ కలవాల్సిఉన్నా, అంతకుముందే ఆయన మీడియాతో మాట్లాడటం, అదే సమయంలో ‘కేసీఆర్‌తో డీఎస్‌ అపాయింట్‌మెంట్‌ రద్దు’ వార్తలు రావడం గమనార్హం.

నాతో మాట్లాడితే సరిపోయేది: ‘‘నేను ఏ పార్టీలో ఉన్నా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాను. క్రమశిక్షణ గురించి ఒకరు నాకు చెప్పాల్సిన పనిలేదు. నిజామాబాద్‌లో జరుగుతోన్న పరిణామాలు దురదృష్టకరం. ఏవైనా తేడాలుంటే నాతో మాట్లాడాల్సింది. కానీ ఏకంగా ఫిర్యాదు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలనే అడగండి. సరే, ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా‌. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అది ఆయన చేతుల్లోనే ఉంది. సీఎం అపాయింట్‌మెంట్‌ అడిగాను కానీ అటు నుంచి స్పందన ఏదీ రాలేదు’’ అని డీఎస్‌ చెప్పారు.

ఢిల్లీకి వెళ్లాను కానీ.. అది అబద్ధం: తాను ఢిల్లీకి వెళ్లినమాట వాస్తవమేనని అయితే వ్యక్తిగత పనుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని డీఎస్‌ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలోని నా క్వార్టర్‌ రిపేర్‌ పనులు జరుగుతున్నాయి. ఆ పని చూసుకుని తిరిగొచ్చేశాను. అక్కడ నేను కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఇతర పార్టీ నేతలను కలవడమే మానేశా. అయినా, ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్‌ నేతలు తప్ప ఇంకెవరు కనిపిస్తారు?’’ అని డీఎస్‌ పేర్కొన్నారు.

కొడుకు అరవింద్‌ గురించి: ‘‘పెద్దాయన ఒక పార్టీలో ఉంటూ  కార్యకర్తలను మాత్రం ఇంకో పార్టీలో చేరమని ప్రోత్సహిస్తున్నారు..’’అన్న ఎంపీ కవిత వ్యాఖ్యలకు డీఎస్‌ వివరణ ఇచ్చారు. ‘‘మా అబ్బాయి ఇండిపెండెంట్‌. తనకు తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. వాటితో నాకు సంబంధంలేదు. అతని వ్యవహారాల్లో నేను తలదూర్చను’’ అని డీఎస్‌ చెప్పుకొచ్చారు.

డీఎస్‌పై చర్యలు తీసుకోండి: మూడేళ్ల కిందట కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన డి.శ్రీనివాస్‌.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎంపీ కవిత నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా డీఎస్‌ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు.

మరిన్ని వార్తలు