సహనమే మన శక్తి : ఆరెస్సెస్‌కు ప్రణబ్‌ ఉద్భోద

7 Jun, 2018 17:59 IST|Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌ : సహనమే మన శక్తి అని, బహుళత్వాన్ని గౌరవించి.. భిన్నత్వాన్ని సంబరంగా భావించడంలోనే మన దేశ గొప్పదనం ఇమిడి ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ‘అసహనం మన జాతీయవాద గుర్తింపు నీరుగారుస్తుంది. మతం, అధికారవాద సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టే’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. గురువారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) తృతీయ శిక్షా వర్గ్‌ ముగింపు సదస్సులో ప్రణబ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ప్రతి రోజూ మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉంది. ఈ హింస అంధకారానికి ప్రతిరూపం. మన మాతృభూమి శాంతి, సామరస్యం, సంతోషం కావాలని అర్ధిస్తోంది. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిది’ అంటూ ప్రణబ్‌ తన ప్రసంగాన్ని ముగించారు. జాతి, జాతియత, దేశభక్తి తదితర అంశాలపై ఆయన ప్రసంగం సాగింది.
 

ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • ప్రాచీనకాలం నుంచి భారత్‌లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారు
  • వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్నది భారతీయత నుంచే వచ్చింది
  • ఒక్కతాటిపైకి వచ్చిన భిన్న జాతుల సంస్కృతి.. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది
  • మౌర్యుల పాలన దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చింది
  • భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల గొప్పతనం
  • అసహనం, ద్వేషం జాతీయతకు ముప్పు
  • ప్రాంతం, మతం, గుర్తింపు ప్రాతిపదికగా దేశాన్ని వీడదీసేందుకు ప్రయత్నిస్తే.. అది మన గుర్తింపునకు ప్రమాదం తెస్తుంది
  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిని దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్‌ పటేల్‌
  • గాంధీజీ చెప్పినట్లు జాతీయవాదం ఏ ఒక్కరిది కాదు.. పైగా అదేం ప్రమాదకరం కాదు
  • అన్ని మతాలు ముఖ్యంగా హిందు, ముస్లింలు కలిస్తేనే.. అది భారతజాతి అని నెహ్రూ చెప్పారు

హెగ్డేవార్‌పై ప్రణబ్‌ ప్రశంసలు
మోహన్‌ భగవత్‌తోపాటు ఆరెస్సెస్‌ ప్రధాన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆరెస్సెస్‌ వ్యవస్థాపక సర్‌సంఘ్‌చాలక్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని ప్రణబ్‌ సందర్శించారు. నాగ్‌పూర్‌లోని హెగ్డేవార్‌ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్‌ బుక్‌లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్‌ అని ప్రశంసించిన ప్రణబ్‌.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. ‘భారతమాత కన్న గొప్పబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఇక్కడికి వచ్చాను’ అని ఆయన విజిటర్స్‌ బుక్‌లో రాశారు. అంతకుముందు ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్‌కు ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సాదర స్వాగతం పలికారు.

 

మరిన్ని వార్తలు