భువనగిరి బరిలో కోమటిరెడ్డి

17 Mar, 2019 00:24 IST|Sakshi

రాహుల్‌ గాంధీకి ‘బ్రదర్స్‌’కృతజ్ఞతలు 

నల్లగొండ నుంచి ఉత్తమ్‌ పోటీ చేసే చాన్స్‌!

సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకిదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన చేసిన ప్రతిపాదనకు అధిష్టానం సమ్మతించినట్టు సమాచారం. నల్లగొండ నుంచి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వెంకటరెడ్డికి భువనగిరి నియోజకవర్గంతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటరెడ్డితోపాటు ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌ కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నాయి. 2009లో ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రాజగోపాల్‌రెడ్డి 2014లో సమీప ప్రత్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ చేతిలో 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అనుకూలతలను విశ్లేషించడంతో అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థిత్వంపై సుముఖత వ్యక్తం చేసినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ అంశంపై కోమటిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ ‘పోటీలో నిలిపేందుకు పార్టీ సుముఖంగా ఉంది. రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం’అని పేర్కొన్నారు.

నల్లగొండ నుంచి ఉత్తమ్‌? 
నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైనప్పటికీ తెలంగాణ నుంచి కొన్ని ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని అధిష్టానం చూస్తుండగా.. నల్లగొండ నుంచి తాను బరిలో ఉండేందుకు సిద్ధమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదాడలో ఆయన సతీమణి పద్మావతి రెడ్డి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. నల్లగొండ లోక్‌సభ నుంచి ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి 2009లో, 2014లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. నల్లగొండ నుంచి 6 సార్లు సీపీఐ అభ్యర్థి గెలవగా, 6 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఒకసారి సీపీఎం అభ్యర్థి, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి గెలుపొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపుతో ఇక్కడ కూడా జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్‌సభ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌ పార్టీకి విస్తృతంగా కార్యకర్తల బలం ఉండటంతో పా టు తన సామాజిక వర్గ ఓటుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవే అంశాలను ఏఐసీసీ కూడా పరిగణనలోకి తీ సుకుని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు