కేసీఆర్‌ను మహిళలే ఓడిస్తారు: ఉత్తమ్‌ 

28 Jun, 2018 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహిళలే ఓడిస్తారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి మహిళలే ఎక్కువగా నష్టపోయారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో అభయహస్తం పథకం మహిళలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు ఈ సందర్భంగా తమ కష్టాలను ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలకు వివరించారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 50 లక్షల మంది అభయ హస్తం మహిళల సొమ్మును తిన్న కేసీఆర్‌కు మహిళల ఉసురు తగులుతుందన్నారు.  

మహిళా మంత్రి లేని రాష్ట్రం తెలంగాణే.. 
దేశంలో 29 రాష్ట్రాల్లో మహిళా మంత్రి లేని ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనే ఉందని ఉత్తమ్‌ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళల్లో ఒక్కరికీ మంత్రిగా పనిచేసే సామర్థ్యం లేదా అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో ఉన్న మహిళలందరికీ అవమానమేనన్నారు.  తాము అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ప్రత్యేక పథకాలు తెస్తామని ఉత్తమ్‌ చెప్పారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల చొప్పున రుణాలిస్తామన్నారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని పునరుద్ధరించి రూ.5 లక్షల వరకు బీమా, పింఛన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు