30న కాకినాడలో ‘వంచనపై గర్జన’ సభ 

26 Nov, 2018 04:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన కాకినాడలో ‘వంచనపై గర్జన’సభ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వంచనపై గర్జన సభలు జరిగాయి.

ఐదో సభగా కాకినాడలో నిర్వహిస్తున్న వంచనపై గర్జనకు వేలాదిగా తరలి రావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విభజన తరువాత ఏపీ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు దాటుతోందని, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కూడా  నెరవేర్చలేదని వైఎస్సార్‌ సీపీ విమర్శించింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని టీడీపీ అమలు చేయకుండా నాలుగున్నరేళ్లుగా దుష్టపాలన సాగిస్తోందని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు