ఆ అధికారులు టీడీపీ కార్యకర్తలే

23 Feb, 2018 02:17 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్‌ అధికారులు, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఐఏఎస్‌ అధికారులు సతీష్‌చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, నిఘా విభాగం అధికారి ఏబీ వెంకటేశ్వరరావుల పేర్లను ప్రస్తావిస్తూ వారిపై గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఉన్నతాధికారులపై విమర్శలు సరికాదని ఐఏఎస్‌ల సంఘం పేర్కొన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రతిస్పందించారు. అధికారులు కోరితే ఆధారాలను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

మంత్రి ఆదినారాయణరెడ్డే ఈ నిజాన్ని అంగీకరించారు
రాజ్యాంగ లక్ష్యాలను చేరుకునే లా కృషి చేయడం ప్రతి అధికారి ప్రాథమిక బాధ్యతని ఈ సంద ర్భంగా విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రభు త్వ అధికారులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉండాలని, పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం తటస్థ వైఖరి అనుసరించాలన్నారు. సర్వీస్‌ రూల్స్, క్రమశిక్షణ నిబంధనలు కూడా ఇవే చెబుతు న్నాయని తెలిపారు. అయితే సతీష్‌ చంద్ర, ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లు రాజమౌళి, సాయిప్రసాద్‌లు పక్షపాత ధోరణితో టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని తెలిపారు.

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, వారికి ఇచ్చే లంచం సొమ్ము సిద్ధం చేయడంలో ఈ అధికారుల ప్రమేయం ఉంద న్నారు. ఈ అధికారులు టీడీపీ నేతలతో కలిసి తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని చెప్పారు. ఇది తాను చేస్తున్న ఆరోపణే కాదని, తమ పార్టీ నుంచి ఫిరాయించి మంత్రి పదవి దక్కించుకున్న ఆదినారాయణరెడ్డే స్వయంగా ఒప్పుకున్న నిజమని తెలిపారు.

ఆరోపణలు వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు
జమ్మలమడుగు నియోజకవర్గం లో నిధులను టీడీపీ నేత రామసుబ్బారెడ్డితో కలిసి చెరి సగం పంచుకోవాల్సిందిగా ఇద్దరు ఐఏఎస్‌ల సమక్షంలోనే ముఖ్యమంత్రి పంచా యితీ చేశారని మంత్రి ఆదినారా యణరెడ్డి వీడియోలో చెప్పటాన్ని విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రామసుబ్బా రెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య చంద్రబాబు ఒప్పందం కుదిర్చిన సమయంలో అక్కడ ఉన్న ఐఏఎస్‌ల్లో సతీష్‌ చంద్ర కూడా ఉన్నా రని వెల్లడించారు.

ఐఏఎస్‌లు సతీష్‌చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వర రావుపై తాను చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. వారిపై సీబీఐతో విచారణ జరిపి ప్రాసిక్యూట్‌ చేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. త్వరలో మరికొందరు అధికారుల వ్యవహారా న్ని కూడా బయటపెడతానని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

మరిన్ని వార్తలు