బాధ్యత నిర్వహిస్తే.. బదిలీ చేశారు

13 Mar, 2019 08:56 IST|Sakshi

సాక్షి, కాశీబుగ్గ: ఇంటి ముందు, ఇంటిపైనా, వీధుల్లో ఫ్లెక్సీలు తొలగించమన్నందుకు ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బదిలీ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పలాస మండలం లక్ష్మిపురం పంచాయతీ పరిధిలో ఉన్న  కిష్టుపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బూర్లె మాధవి ఇంటి వద్ద మంగళవారం జెండాలు ఎగరడంతో బ్రాహ్మాణతర్లా రూట్‌లో ఎన్నికల అధికారి డి అనితాదేవి ఆదేశాల మేరకు వీఆర్‌ఓ సంతోష్‌కుమార్‌ వాటిని తొలగింపజేశారు.

వీఆర్‌ఓకు బెదిరింపులు 
లక్ష్మిపురం పంచాయతీ ఎంపీటీసీ బూర్లె మాధవి భర్త బూర్లె రాజు వీఆర్‌ఒపై ఫోన్‌లో విరుచుకుపడి.. ఎక్కడున్నావో చెప్పు.. ఎవడవురా నీవు ఎవరనుకుంటున్నావు, కట్టేసి కొడతాంరా అంటూ చిందులు వేశారు. అప్పటికీ ఊరుకోక ఎమ్మెల్యే అల్లుడు యార్లగడ్డ వెంకన్నచౌదరి, పీరుకట్ల విఠల్‌రావులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారి అనితాదేవితో వాదనకు దిగారు. రూల్స్‌ ఎలా ఉంటే అలా చేస్తామని చెప్పడంతో వెనుదిరిగి తహసీల్దారు బాపిరాజును పట్టుకుని ఇలా అయితే గొడవలు వస్తాయని చెప్పి వీఆర్‌ఓను బదలాయించారు. ఆయనకు వేరే ప్రాంతం చూడమని, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పీరుకట్ల విఠల్‌ బంధువు హేమగిరిని వీఆర్‌ఓగా ఫుల్‌చార్జ్‌తో  నియమించారు. 

ఎటువంటి గొడవలు రాకూడదని మార్చాం.. 
ఎన్నికల విధులలో భాగంగా కిష్టుపురం వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌కుమార్‌ను వేరే ప్రాంతానికి పంపించి ఫుల్‌చార్జ్‌ వీఆర్‌ఓ హేమగిరిని నియమించాము. వాస్తవంగా తహసీల్దారు కార్యాలయం వద్ద ఎటువంటి గొడవలు జరగలేదు. కిష్టుపురంలో జెండాలు తొలగించమంటే అబ్జక్షన్‌ చేశారు. దానికి ఎన్నికల అధికారి వివరణ ఇవ్వడంతో వెనుదిరిగారు.
–బాపిరాజు, తహసీల్దారు, పలాస   

మరిన్ని వార్తలు