ఇది శాశ్వతంగా వీడిపోవడం కాదు

4 Jun, 2019 11:55 IST|Sakshi

ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

అఖిలేశ్‌, డింపుల్‌ నా కుటుంబసభ్యుల్లాంటివారు

బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటైన మహాకూటమికి గుడ్‌బై చెప్పినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. రానున్న ఉప ఎన్నిక‌ల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. స‌మాజ్‌వాదీ పార్టీ త‌మ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రికి వారు ఒంట‌రిగా పోటీచేయ‌డ‌మే మంచిదని, సోమవారం జ‌రిగిన ప‌దాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణ‌యం తీసుకున్నామని వెల్లడించారు.

స‌మాజ్‌వాదీ పార్టీ  ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు పడలేదని ఆమె విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామన్నారు. ఇది శాశ్వ‌తంగా విడిపోవ‌డం కాదని, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాద‌వ్‌తో రాజ‌కీయాల‌కు అతీతంగా సంబంధాలు ఎప్ప‌టికీ కొన‌సాగుతాయని వెల్లడించారు. అఖిలేష్‌, డింపుల్ దంపతులు తనకు ఎంతో గౌర‌వం ఇచ్చారని, వారిని తన కుటుంబ స‌భ్యులుగా భావించానని చెప్పారు.

మరిన్ని వార్తలు