ప్యాంటు తడిపేసుకున్న చంద్రబాబు!

18 Jun, 2018 19:34 IST|Sakshi
పి.గన్నవరంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌, (ఇన్‌సెట్‌లో మోదీతో చంద్రబాబు కరచాలనం)

సాక్షి, పి.గన్నవరం: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. షర్టు చేతులు పైకి మడిచి ఆయన యుద్ధం చేయబోతున్నారు.. మోదీని కడిగేసి, నిలదీస్తాడు... మిగతా ముఖ్యమంత్రులకు కనుసైగలు చేసి ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తారు... అంటూ ఆయన అనుకూల ఎల్లో మీడియా ఊదరగొట్టింది. ఈ ప్రేలాపలను చూసి మనకు మహాభారతంలోని ఉత్తరకుమారుడు గుర్తొస్తాడు. కౌరవులను ఇరిచేస్తా, తలపాగా కుచ్చిళ్లను తెంపుకొస్తా అని పెద్ద మాటలు మాట్లాడిన ఉత్తరకుమారుడు.. తీరా యుద్ధరంగానికి వెళ్లి ప్యాంటులోనే అన్నీ కార్చేసుకుంటాడు. నిన్నటి నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ చంద్రబాబుది ప్యాంటు తడిపేసుకున్న పరిస్థితే!’’ అని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. 192వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు చిలక-మోదీ గొరింక: ప్రత్యేక హోదా లేని కారణంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో చెప్పి, కేంద్రం నుంచి అందాల్సినవి డిమాండ్‌ చేయాల్సింది పోయి, ఉల్టా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పడంలోనే ఆయన ఆంతర్యం బయటపడుతుంది. ఇక్కడేమో హోదా కోసం పోరాటాలు, ధర్మదీక్షలు అంటాడు. తీరా ఢిల్లీకి పోయి వంగి వంగి మోదీకి సలాం చేస్తాడు. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకున్నా.. ప్రధాని ఎడమచేతిని పట్టుకోడానికి పాకులాడుతాడు. ఇక్కడేమో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినా, బీజేపీని ఆకాశానికెత్తేస్తూఉంటారు టీడీపీ ఎంపీలు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్తను చంద్రబాబు పక్కన పెట్టుకుంటాడు. బాలకృష్ణ సినిమా షూటింగ్‌కి వెంకయ్య నాయుడు వస్తారు. ఇదెక్కడి విడాకుల పర్వమో అర్థంకాదు! నాలుగేళ్లపాటు చిలకా గోరింకలు సైతం చిన్నబోయేలా సంసారం చేసి, హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి, ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటకాలకు తెరలేపారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగితే, ఈ పాటికి హోదా వచ్చేది. అది చేయకపోగా, రాజీనామాలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దుర్మార్గుడికి బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

బాబు పాలనలో కష్టాల కూపంలా కోనసీమ: గడిచిన నాలుగురోజులుగా ఇక్కడి రైతన్నలు, రైతు కూలీలు నన్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు. అన్నపూర్ణలాంటి కోనసీమ నుంచి ప్రజలు హైదరాబాద్‌, తమిళనాడు ప్రాంతాలకు వలసలు పోతున్నారని విని బాధపడ్డాను. తూర్పుగోదావరి జిల్లాలో 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట ఉంటే, అందులో 90 శాతం వాటా కోనసీమదే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొబ్బరి రేటు 4వేల రూపాయలు కిందకు పడిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రఖ్యాత అంబాజీపేట మార్కెట్‌లో ఒకప్పుడు 600 కొబ్బరి దుకాణాలుండేవి.. బాబు దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల ఇప్పుడా దుకాణాల సంఖ్య 10కి పడిపోయింది. మహానేత వైఎస్సార్‌ హయాంలో కొబ్బరిపై ఉన్న నాలుగు శాతం పన్నును ఎత్తేశారు. ఇప్పుడేమో జీఎస్టీ పేరుతో 5శాతం పన్ను బాదుతున్నారు. కొబ్బరి వొలిచే కూలీల బతుకులైతే మరీ దయనీయం.

మహానేతను స్మరించుకుంటున్న జనం: గోదావరి ఎంత వరమో, వరదలప్పుడు అంతే నష్టం చేస్తుంది, ప్రమాదాలు జరగొద్దంటే యేటి గట్లు కోతకు గురికాకుండా కాపాడుకోవాలి, ఆ విషయాన్ని ఎవరైన పట్టించుకున్నారంటే ఒక్క మహానేత వైఎస్సారే అని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. యేటి గట్ల పటిష్ఠత కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన ఘనత వైఎస్సార్‌ది. అదే గడిచిన నాలుగేళ్లలో చిన్న పనులు కూడా చేయట్లేదు. మంచి చేసినవారిని జనం ఎంతగా గుర్తుపెట్టుకుంటారో, ఏమీ చేయని వారిని అంతకంటే ఎక్కువే తిట్టుకుంటారన్నది వాస్తవం.

నగరం స్మార్ట్‌ సిటీ హామీ ఏమైంది?: పచ్చగా ఉండ కోనసీమ గుండెల్లో అలజడి కూడా అంతే.. చమురు, సహజ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ చేస్తారు. గ్యాస్‌ పంపిణీ కోసం పొలాల మధ్య నుంచి పైపు లైన్లు. 2014లో నగరంలో గ్యాస్‌ లీకై 22 మంది చనిపోయి, 9 మంది తీవ్రంగా కాలిపోయిన పరిస్థితి. బీజేపీ-టీడీపీ దంపతులు నగరం గ్రామాన్ని స్మార్ట్‌ విలేజ్‌గా చేస్తామని చెప్పారు. 18 డిమాండ్లు నిరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటిలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు, ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌, శుద్ధీకరించిన మంచినీటి సరఫరా, ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు తదితర హామీలున్నాయి. కానీ ఇవాళ్టికీ కాలిన గాయాలతో ఆ 9 మంది కుటుంబాలు బాధపడుతున్నాయి. ప్లాస్టిక్‌ సర్జరీకి డబ్బులిస్తామన్న ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది’’ అని వైస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు