ఇది బెంగాలే.. పాకిస్తాన్‌ కాదు 

8 May, 2019 03:11 IST|Sakshi

జై శ్రీరామ్‌ అని జపిస్తే మమత జైల్లో పెడతారా?

బెంగాల్‌ ప్రచారంలో అమిత్‌ షా

ఘటాల్‌/విష్ణుపూర్‌(బెంగాల్‌): పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు జై శ్రీరామ్‌ అని జపించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమతించడం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. బెంగాల్‌లోని ఘటాల్, కేషియరీ, విష్ణుపూర్‌ల్లో మంగళవారం అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘భారత సంస్కృతిలో శ్రీరాముడు ఓ భాగం. ఆయన పేరును పలకకుండా ప్రజలను ఎవరైనా ఆపగలరా?  మమతను ఒకటి అడగాలనుకుంటున్నా. రాముడి పేరును భారతదేశంలో కాకుంటే పాకిస్తాన్‌లో జపిస్తారా? ఇది బెంగాల్‌. పాక్‌ కాదు. నేను ఇప్పుడే కోల్‌కతాకు వెళ్తున్నా. మమతకు ధైర్యం ఉంటే నన్ను జైల్లో పెట్టమనండి’ అని అమిత్‌ విరుచుకుపడ్డారు.

జై శ్రీరామ్‌ అని జపించేవారిని జైల్లో పెడతానని మమత ఇటీవల అన్నట్లు అమిత్‌ షా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ప్రధాని మోదీ గురువారం పాల్గొనాల్సిన రెండు సభలకు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తనకు తెలిసిందని, ఇలాంటి మార్గాలను అనుసరించడం ద్వారా మమత తన ఓటమి నుంచి తప్పించుకోగలరా అని అమిత్‌ ప్రశ్నించారు. బోఫోర్స్‌ శతఘ్నుల కుంభకోణంపై మోదీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడుతూ ‘రాజీవ్‌గాంధీ నంబర్‌ 1 అవినీతిపరుడు’ అని అనడం తెలిసిందే. దీంతో తన తండ్రిని, మాజీ ప్రధానిని మోదీ అవమానించారంటూ రాహుల్‌ గాంధీ అనడంపై కూడా అమిత్‌ షా స్పందించారు. రాజీవ్‌గాంధీ హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని, దానిని ప్రస్తావించడం మాజీ ప్రధానిని అవమానించడం ఎలా అవుతుందని అమిత్‌ ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు