మౌనాన్ని వీడిన రాహుల్‌ గాంధీ

1 Jun, 2019 11:36 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రసంగం

బీజేపీపై ప్రతిరోజూ పోరాడతామని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు పట్టుబడుతున్న రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. శనివారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో బీజేపీపై, నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీపై ప్రతిరోజూ పోరాడుతామని  ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించాల్సిన అవసరముందని, దానిని మనం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోనని రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సీపీపీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశానికి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు కావాలి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టే అంశంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అంటున్నారు. రాజీనామాకు సిద్ధపడిన తర్వాత రాహుల్‌ గాంధీ మాట్లాడటం ఇదే తొలిసారి.
 

మరిన్ని వార్తలు