‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’

24 Mar, 2019 11:38 IST|Sakshi

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి సూపర్‌ హిట్ కథలను అందించిన ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ, పవన్‌ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదన్న చిన్ని కృష్ణ తాను కూడా కాపునే అని చెప్పారు. కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్‌ కాదు.. కాపులు అంటే రంగా, ముద్రగడ లాంటి నాయకులు అన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవికి ఆల్‌ టైం హిట్ సినిమా ఇంద్ర లాంటి కథ ఇస్తే ఏ రోజు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ ను హీరోగా పరిచయం చేసేందుకు గంగోత్రి కథ కోసం ఎన్నో అవకాశలు వదులుకున్నానని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌కు సినిమాల పట్ల ఫోకస్‌ లేదన్న చిన్ని కృష్ణ, ఇండస్ట్రీలో తెలుగు వారిని అతి తక్కువ గౌరవించే వ్యక్తి పవన్‌ అని విమర్శించారు.
(చదవండి : తెలంగాణలో ఎవరిని కొట్టారో చెప్పాలి)

కేసీఆర్‌ చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావ్‌ పవన్‌ అంటూ ప్రశ్నించారు. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. అంతేకాదు ఇక్కడి సెటిలర్స్‌ అంతా పవన్‌, బాబులకు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మీరు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇక్కడి వ్యవస్థ మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వొచ్చి కాపాడతావా.? లేక మీ అన్నలు నాగబాబు, చిరంజీవిలు వచ్చి కాపాడతారా.? మా జీవితాలతో ఆడుకునే వ్యాఖ్యలు చేయోద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల సొమ్ముతో ఎదిగిన మీ కుటుంబం వారికి తిరిగి ఏం చేసింది..? సినీ రంగం నుంచి ఇంత పొందిన మెగా ఫ్యామిలీ సినీరంగం కోసం ఒక్క కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు.

అసలు నువ్వు సినీ రంగంలో ఎన్ని విజయాలు సాధించావ్‌ చెప్పు అంటూ పవన్‌ ను ప్రశ్నించారు. అజ్ఞాతవాసి.. ఓ విదేశి కథను కాఫీ కొట్టి తెరకెక్కించిన సినిమా కాదా... దొంగతనం చేసిన కథతో సినిమా తెరకెక్కించి ఆ విషయంలో టీ సీరిస్‌కు పెనాల్టీ కట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. రాజకీయం అంటే త్రివిక్రమ్‌ రాసిచ్చిన డైలాగులు చెప్పటం కాదు పవన్‌ అంటూ చురకలంటించారు.
(చదవండి : అధికారపక్షాన్ని ప్రశ్నించకపోవడమే పవన్‌ ట్రెండా? )

జగన్‌ సొంత పార్టీ పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతుంటే.. ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన తండ్రిని చంపారు, బాబాయిని చంపి ఆ నింద వేస్తున్నారు, ఆయన్ని చంపే కుట్రలు చేస్తున్నారు. ఇదా రాజకీయం.. రాజకీయం అంటే ఏంటో సీనియర్ల దగ్గరికి వెళ్లి నేర్చుకో అని పవన్‌కు హితవు పలికారు. మే 23న రాబోయే రిజల్ట్ చూస్తే మీ గుండెలు బద్ధలైపోతాయి, ప్రజలు జగన్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు గోదావరి సాక్షిగా అంత మంది చావుకు కారణమైతే నీకు కనిపించలేదా పవన్‌, బోయపాటి శ్రీనివాస్‌ అనే దర్శకుడిని తీసుకు వచ్చి వేల మంది మధ్య షూటింగ్‌ చేస్తూ ఆడపడుచుల ఉసురు తీసి ఇప్పుడు పసుపు కుంకుమ పంచుతున్నారన్నారు. విజయవాడలో కేవలం 62 పిల్లర్ల ఫ్లైఓవర్‌ను ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనటం లేదే అని పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి : పవన్‌ పూటకో మాట.. రోజుకో వేషం )

మరిన్ని వార్తలు