సీమ అభివృద్ధికి ఐక్య పోరాటం

9 Feb, 2018 07:25 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వ

ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు

ప్రత్యేక హోదాతోనే రాయలసీమకు న్యాయం

అనంతపురం రూరల్‌: రాయలసీమ అభివృద్ధికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి  అద్యక్షతన గురువారం న్యాయవాదులు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలకు ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, రాయలసీమ విమోచన సమితి నాయకులు సీమ కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు టి.పి.రామన్న, పీఎస్‌వో విద్యార్థి సంఘం, కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. 

శిబిరంలో విశ్వ, అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సెక్షన్‌4 ప్రకారం హైకోర్టును రాజధాని ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీమకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అభివృద్ధిని హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకరించడం వల్ల విభజన తర్వాత అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని గుర్తు చేశారు. మరోసారి అదే తప్పుని సీఎం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు.  
వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు