ఇక గులాబీ ప్రతినిధి!

7 Jun, 2019 10:00 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయ్యింది. ఈ విషయాన్ని గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన 12 మంది అధికారికంగా   టీఆర్‌ఎస్‌ సభ్యులయ్యారు. అందులో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు ఒకరు..

సాక్షి, కామారెడ్డి:  అసెంబ్లీ ఎన్నికల్లో కామా రెడ్డి జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా ఎల్లారెడ్డిలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ వరుస విజయా లు సొంతం చేసుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకతకు తోడు సురేందర్‌ మీద ఉన్న సానుభూతిలో టీఆర్‌ఎస్‌ హవాకు అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జాజాల(నల్లమడుగు) సురేందర్‌ 35,148 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అయితే టీఆర్‌ఎస్‌ గాలిని తట్టుకుని విజయం సాధించిన సురేందర్‌ కొంత కాలానికే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతిపక్ష హోదాను కోల్పోయేలా చేయడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ వేసిన ఎత్తుల్లో భాగంగా తమ పార్టీలోకి చేరనున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి  వినతిపత్రం అందించారు. గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో సీఎల్పీ విలీనం అనేది లాంఛనమేనని తేలిపోయింది. ఇలా వినతిపత్రం ఇచ్చారో లేదో.. అలా విలీన ప్రక్రియ పూర్తి చేశారు. గురువారం రాత్రే సీఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్లు శాసనసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. దీంతో నల్లమడుగు సురేందర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికే సురేందర్‌ అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎల్పీ విలీనంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ఎంపీతో పాటు జెడ్పీ చైర్మన్‌ కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే ఉన్నారు. 

మరిన్ని వార్తలు