బాబుది 420 దీక్ష

18 Apr, 2018 01:44 IST|Sakshi
మైలవరంలో జరిగిన సభకు భారీ ఎత్తున హాజరైన జన సందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కొంగ జపం చేస్తారట 

మైలవరం సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

పట్టిసీమ ప్రాజెక్టులో రూ.372 కోట్ల అవినీతి జరిగింది. వీళ్ల దోపిడీని కాగ్‌ రిపోర్టు నిగ్గు తేల్చినా.. మా కేంటి సిగ్గు అన్నట్లుగా ఆ మంత్రి, ఈ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వీళ్లు దోచేసిన డబ్బుతో ఏమి చేయాలో అర్థం కాక 23 మంది మన పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కోట్ల డబ్బు పెట్టి కొనుగోలు చేశారు. వాళ్లతో రాజీనామా చేయించి, టీడీపీ టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించుకునే సత్తా, దమ్ము, ధైర్యం లేని పాలకులు వీళ్లు. 
 

చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్‌ 20. ఏప్రిల్‌ అంటే 4వ నెల.. తేదీ 20. అంటే 420. అదే రోజున ఆయన ‘420’ దీక్ష చేస్తారట. ఆ రోజు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేసిన రోజే నీవు (బాబు) కూడా, నీ ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌కు వెళ్లి నిరాహార దీక్ష చేయించి ఉంటే దేశం మొత్తం దాని గురించి చర్చించి ఉండేది కాదా? మనకు హోదా వచ్చి ఉండేది కాదా? అని చంద్రబాబును గట్టిగా అడగండి. ఇలాంటి ఈ పెద్దమనిషి ఆయన పుట్టిన రోజున ఇప్పుడు ఇక్కడ కొంగ జపం చేస్తారట. అది 420 దీక్ష కాదా? 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రి చంద్రబాబు తన పుట్టిన రోజు ఈ నెల 20న చేపట్టే దీక్ష 420 దీక్ష అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దీక్షంటూ కొంగజపం చేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుకాసురులకు, అవినీతి రాకాసులకు చంద్రబాబు బాస్‌ అని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 138వ రోజు మంగళవారం కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభలో ఏమన్నారంటే.. 

అన్యాయపు రాజు దర్బారులో అవినీతి మంత్రి 
‘‘మైలవరం నియోజకవర్గంలోకి రాగానే ప్రజలు నాతో అన్న మాటేమిటంటే.. ‘అన్నా.. అన్యాయపు రాజుగారి దర్బార్‌లో ఆయన ఓ అవినీతి మంత్రన్నా..’ అని చెప్పారు. వీళ్ల అవినీతి అంతా ఇంతా కాదన్నా అని వాపోయారు. పట్టిసీమ మొదలు పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా వరకు ఆ రాజు, ఈ మంత్రి దోపిడీయే దోపిడీ. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో తినుడే తినుడు. వీళ్లు జారీ చేసిన జీవోలు 22, 63 ఏంటో తెలుసా? ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ ఇవ్వాల్సిన పని లేదు. అయినా బాబు రాక మునుపు కాలానికి అంటే 2013 ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ వర్తించే విధంగా తెచ్చిన జీవో అది. ఇది వరకే చేసిన పనులకు కూడా దాన్ని వర్తింపజేశారు. దీనర్థం లంచాలు దండుకోవడం. అది కూడా వారు ఎంచుకున్న కాంట్రాక్టర్లకు మాత్రమే. లంచాలు పంచుకునే జీవోలవి. ఇంత దారుణంగా, అన్యాయంగా దోచేసిన స్థితి దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా ఉండదేమో. ఇదేజిల్లాలో అడుగు పెట్టినప్పుడు రైతులు నన్నడిగారు.. ‘అన్నా.. చదువుకునే రోజుల్లో బకాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు వంటి పేర్లు విన్నాం.

ఈ చంద్రబాబు పాలనలో ఇసుకాసురులు ఉన్నారన్నా’ అని చెబుతున్నారు. ఈ రాక్షసులకు, ఇసుకాసురులకు బాస్‌ చంద్రబాబు. ఈ బాబు గారు ఉండే ఇల్లు కృష్ణానది ఒడ్డున ఉంది. దానికి ఏ రకమైన అనుమతులు లేవు. ఇలాంటి అక్రమ కట్టడంలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ఇంటి పక్కనే, ఈ పెద్ద మనిషి కళ్లెదుటే ఇసుకను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. నదికి ఆవైపున ఉండవల్లి, వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల నుంచి చంద్రబాబు కళ్లముందే యథేచ్ఛగా వేలాది లారీలతో ఇసుకను దోచుకుంటున్నారు. కృష్ణానదికి ఇవతల కస్తల, కోసూరు, కంచికచర్ల, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, సూరాయపాలెంలో కూడా ఈ మంత్రి ఆధ్వర్యంలో ఇసుక మాఫియా తవ్వకాలు చేపట్టి వేల లారీలతో లక్షల టన్నుల ఇసుకను తోడేస్తోంది. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోవడం లేదంటే అవినీతి ఏ స్థాయిలోకి వెళ్లిందో అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, చినబాబు, పెదబాబుల వరకు అంతా అవినీతి మయమే. కృష్ణా పుష్కరాలలో రూ.1,400 కోట్లు దోచేశారన్నా అని ఈ జిల్లా ప్రజలు చెప్పారు.

రాజధాని ఎక్కడ వస్తుందో బాబుకు ముందే తెలుసు... 
ఫలానా ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించారు. నాగార్జున యూనివర్సిటీ అని, నూజివీడు ప్రాంతమని, ఆ తర్వాత ఏలూరని చెప్పారు. ఆయన, ఆయన బినామీలు మాత్రం తుళ్లూరు ప్రాంతంలో తక్కువ ధరలకు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2014 డిసెంబర్‌ చివర్లో తుళ్లూరులోనే రాజధాని వస్తుందని ప్రకటించారు. కారు చౌకగా భూములు కొని చంద్రబాబు రైతులను మోసం చేశారు. రైతులను అడ్డుగోలుగా దోపిడీ చేశారు. ఈయన చేసింది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా? ఇలా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినందుకు ఆయన్ను జైలులో పెట్టకూడదా.. అని మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నా. వీరు కొన్న భూములకు రేట్లు వచ్చేలా కృష్ణా, గుంటూరు జిల్లాలను జోనింగ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ జోన్‌లో తాను, తన బినామీలు.. మైలవరం, జి.కొండూరు ప్రాంతం సహా మిగిలిన రైతుల భూములు వ్యవసాయ ఆధారిత జోన్లలో ఉండేలా చేశారు. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ జోన్లలోని వారు వెంచర్లు వేసుకుని ప్లాట్లు అమ్ముకుంటుంటే వ్యవసాయ జోన్లలోని రైతులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చివరకు పిల్లలకు పెళ్లిళ్లు చేయడానికి కూడా అవస్థలు పడే స్థితిలో ఉన్నారు’ అని జగన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు