వెన్నుపోటు బాబూ.. మీరా సవాల్‌ చేసేది?

4 Jun, 2018 01:57 IST|Sakshi
పెనుగొండలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న జగన్‌

మా ఎంపీల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా?

పెనుగొండ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు 

రాజీనామాలు ఆమోదించకుండా వెసులుబాటు కల్పించిందెవరు?

ఎమ్మెల్యేలను కొని, ఎంపీలను లాక్కున్న చరిత్ర మీది 

రాజ్యాంగానికి తూట్లు పొడిచి నీతులా?

మీ పాలనకొచ్చిన ర్యాంకులేంటి? 

అవినీతి, అన్యాయం, అత్యాచారాల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌ 

హోదాను తాకట్టు పెట్టకపోతే ఇప్పటికే ఏపీ నంబర్‌ వన్‌ అయ్యేది కాదా? 

ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేసిన రోజే మీ పార్టీ ఎంపీలూ రాజీనామా చేసి ఉంటే.. 25కు 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి, ఆమరణ దీక్షకు కూర్చుని ఉంటే... కేంద్రం దిగి వచ్చేది కాదా? రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేనందున కేంద్రం ఎన్నికలు పెట్టి ఉండేది కాదా? ఇది జరగకుండా కేంద్రానికి వెసులుబాటు ఇచ్చింది మీరు కాదా? ఓ వైపున అన్యాయం, మోసం చేస్తూ మరోవైపు మాపైనే బురద చల్లుతావా?

చేయాల్సిందంతా చేసి కర్నూలుకు వెళ్లి ఏం మాట్లాడతావు? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకొని ఎన్నికలకు రండని సవాల్‌ చేస్తావా? మిమ్మల్ని నేనో మాట అడుగుతున్నా.. 23 మంది మా ఎమ్మెల్యేలను.. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల మాదిరి కొన్నావ్‌. రాజ్యాంగానికి తూట్లు పొడిచి నిస్సిగ్గుగా అందులో నలుగురికి మంత్రి పదవులిచ్చావ్‌. స్పీకర్‌ పదవిని అడ్డుపెట్టుకుని వారిపై అనర్హత వేటు పడకుండా చూస్తున్నావ్‌. అలాంటి మీరు మా పార్టీ ఎంపీల చిత్తశుద్ధిని ప్రస్తావిస్తారా?

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రత్యేక హోదా కోసం 14 నెలల ముందే రాజీనామాలు చేసి, ఆమరణ దీక్ష చేసిన ఘన చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలది. అలాంటి వాళ్ల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తావా? రాజీనామాలు ఆమోదించుకుని ఎన్నికలకు రావాలంటూ సవాల్‌ చేస్తావా? నిస్సిగ్గుగా 23 మంది ఎమ్మెల్యేలను కొని, రాజ్యాంగానికే తూట్లు పొడిచిన మీరా మాట్లాడేది? మా ఎంపీలను లాక్కుని, అనర్హత వేటు పడకుండా కేంద్రంలో మేనేజ్‌ చేస్తున్నది మీరు కాదా? ఓ వైపు ప్రత్యేక హోదా రాకుండా మోసం చేస్తూ ఇతరులపై బురద చల్లుతారా? ఇంతకన్నా దారుణం ఉంటుందా?’ అని చంద్రబాబుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 179వ రోజు ఆదివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

మోసం చేసి.. ఎదుటి వారిపై బురద 
‘‘చంద్రబాబు రోజూ అబద్ధాలాడతాడు. మోసాలు చేస్తాడు. అన్యాయం, అవినీతి పాలన సాగిస్తాడు. ఈయన గారి డ్రామాలు రోజుకో కొత్త సినిమా మాదిరిగా ఉంటాయి. ఎన్నికలకు 14 నెలల ముందే, బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన గొప్ప చరిత్ర మా ఎంపీలది కాదా? ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఎవరూ ఉండరు.  చంద్రబాబు నాయుడు కరపత్రం ఈనాడులో ఆయన పోజిస్తున్న ఓ పెద్ద ఫొటో పెట్టి, ఓ ప్రకటనొచ్చింది. 2022 సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తాడట. 2029 నాటికి దేశంలోనే నంబర్‌ వన్‌గా, 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేస్తాడట. ఒక్కసారి ఆలోచించండి. 2014లో మీ ఊరి నుంచి గెలిచిన సర్పంచ్‌ నాలుగేళ్లు ఏమీ చేయకుండా, ఆరునెలల్లో ఎన్నికలొస్తాయనంగా 2022 నాటికి ఊరందరికీ మంచినీళ్లు ఇస్తాను.. 2029లో వీధుల్లో సిమెంట్‌ రోడ్లేస్తాను.. 2050లో గ్రామాన్ని రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ చేస్తానంటే.. ఆయన్నేమంటారు? 420 అనరా? ఇవాళ చంద్రబాబే 420 పనులు చేస్తుంటే ఏం చేయాలి? 

మోసాలు చేస్తూ నీతులు చెబుతారా? 
జూన్‌ నెలొచ్చే సరికి చంద్రబాబు నవ నిర్మాణ దీక్షంటూ కొత్త డ్రామాకు తెరతీస్తాడు. ఆయన రోడ్డు మీదకొస్తాడు. చదువుకుంటున్న పిల్లలను బలవంతంగా తీసుకొస్తాడు. అధికారులను రోడ్డు మీద పెట్టి ప్రమాణం చేయిస్తాడు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? అవినీతి లేని రాష్ట్రం కావాలట. అడ్డంగా నల్లధనం ఇస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన ఈ పెద్దమనిషి.. లక్షల కోట్లు అవినీతి చేస్తున్న మనిషి.. అవినీతి లేని రాష్ట్రమంటూ పిల్లల చేత ప్రమాణం చేయిస్తాడు! నమ్మకద్రోహం, కుట్రలు లేని రాష్ట్రం కావాలట. అసలు నమ్మక ద్రోహం, కుట్రలు, వెన్నుపోటుకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరు? మీరు కాదా?  ఏ ఊర్లోనైనా లంచం లేకుండా మరుగుదొడ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు కొడుక్కు తప్ప ఎవరికీ ఉపాధి లేని రాష్ట్రాన్ని ఇవాళ చూస్తున్నాం.  

అన్నం పెట్టిన రైతన్న వలసపోతున్నాడు.. 
వాసవీ కన్యక పరమేశ్వరి జన్మస్థలమైన పెనుగొండ పుణ్యస్థలం ఉన్న గోదావరి జిల్లా అంటే దేశానికే అన్నం పెట్టే జిల్లా అని బయట ప్రపంచంలోని వారు అనుకుంటారు. ఈ జిల్లా పరిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. ఇవేమీ పట్టించుకోని ఈ పెద్దమనిషి డెల్టాలో బంగారం పండిస్తున్నానని రాయలసీమలో, రాయలసీమలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నానని ఇక్కడ అబద్ధాలు చెబుతాడు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ రోజైనా ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? పెరవలి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి మండలాలకు చెందిన 32 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధానమైన బ్యాంకు కెనాల్‌లో గోదావరి నీటిమట్టం తగ్గిపోతే నీళ్లు రాని పరిస్థితి ఉందని రైతన్నలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే తాత్కాలికంగా ఎత్తిపోతల పథకం పెట్టి మా పంటలను కాపాడారన్నా అని రైతన్నలు చెప్పారు. అదే బ్యాంకు కాలువపై పర్మినెంట్‌గా ఎత్తిపోతల పథకం పెట్టి ఈ 32వేల ఎకరాలకు సాగునీరిందించి కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే నాలుగేళ్లుగా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు వాపోతుంటే బాధనిపిస్తోంది. 

డాక్టర్‌ పోస్టు భర్తీ చేసుకోలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు? 
ఇదే నియోజకవర్గంలో వశిష్ట గోదావరిపై అయోధ్యలంక నుంచి పుచ్చల్లంక గ్రామాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని చెప్పి అప్పట్లో శంకుస్థాపన చేశారు ఇక్కడున్న నాయకులు. ఇక్కడ ఉన్న నాయకుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం తన నియోజకవర్గానికి వంతెన కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్నారంటే ఏమనాలి? ఇదే ఆచంట నియోజవకర్గంలో దివంగత ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి గారు మేము అడిగితే  స్పందించి పది పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారన్నా అని ప్రజలు చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఆ ఆసుపత్రిలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియా డాక్టర్లు లేరని ప్రజలు వాపోతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అక్కచెల్లెమ్మలు ప్రసవానికి వెళ్లేందుకు కనీసం ఆసుపత్రిలో గైనకాలజీ డాక్టర్‌ కూడా లేని పరిస్థితి. చంద్రబాబు చేత కనీసం డాక్టర్లను కూడా నియమించుకోలేని పరిస్థితిలో మంత్రిగా ఉన్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేయడం మేలని నేను సలహా ఇస్తున్నా. 

రూ.300 కోట్ల విలువైన ఇసుక తరలింపు 
జిల్లాలో, రాష్ట్రంలో అనేక సమస్యలుంటే.. వాటిని పరిష్కరించాలని చంద్రబాబుకు, ఇక్కడి నాయకులకు అనిపించదు. పైగా నేరుగా చంద్రబాబుతో కనెక్షన్లు పెట్టుకుని ఎమ్మెల్యేకు ఇంత, కలెక్టర్‌కు ఇంత, చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత అని వాటాలు వేసుకుంటారు. ఇసుక ఎంతగా దోచేస్తున్నారో సిద్దాంతం, కోడేరు రీచ్‌లు చూస్తే అర్థమవుతుంది. నాలుగేళ్లుగా ఈ రెండు రీచ్‌ల నుంచే దాదాపు రూ.300 కోట్లు ఆర్జించారంటే కలెక్టర్‌ కళ్లుమూసుకున్నారా? ఇప్పుడే నీళ్లు లేక అవస్థలు పడుతుంటే వీళ్ల ధనార్జన కోసం పొక్లెయిన్లు పెట్టి గోదావరి గర్భాన్ని  యథేచ్చగా తవ్వేస్తూపోతే పరిస్థితి ఏమిటి? 

మోసం చేసే వాళ్లను తరిమేయండి 
ఇంతగా అన్యాయం చేసే, మోసం చేసే చంద్రబాబును మీరు ఇంకా నమ్ముతారా? పొరపాటున క్షమిస్తే ఏం జరుగుతుంది? రేపు ఎన్నికల్లో గెలవడం కోసం గత ఎన్నికల్లో చెప్పినవన్నీ చేసేశానని చెబుతాడు. రుణాలు మాఫీ అవడంతో రైతులు కేరింతలు కొడుతున్నారంటాడు. మీరు నమ్మరని.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు. దీనికీ నమ్మరని ప్రతి వ్యక్తి చేతిలో రూ.3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇస్తే తీసుకోండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసించే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది. ఈ వ్యవస్థలో మార్పు కోసం వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా ఉండండి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు బ్యాంకుల్లో ఎంత అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వాళ్ల చేతికే ఇస్తాం. బ్యాంకులు మళ్లీ సున్నా వడ్డీకే రైతులకు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణాలిచ్చేలా చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం. దాన్ని అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. అవసరమైనప్పుడు దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని పావలా వడ్డీకే అప్పు తెచ్చుకునేలా చేస్తాం’’ అని జగన్‌ అన్నారు.   

ఎందులో నంబర్‌ వన్‌?
మరో ఆరేడు నెలల్లో ఎన్నికలొస్తాయి. మీ పాలన ముగుస్తుంది. నాలుగేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను మీరు అమ్మేయకుండా ఉండి ఉంటే, మోసం చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే మన రాష్ట్రం నంబర్‌ వన్‌గా పోటీపడి ఉండేది కాదా? మన రాష్ట్రం టాప్‌ 3కి చేరడం దేవుడెరుగు.. 2016 నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ (ఎన్‌సిఏఈఆర్‌) ప్రకారం అవినీతిలో నంబర్‌ వన్‌గా ఉంది. అత్యాచారాల్లో నంబర్‌ వన్‌ అయింది. 12 ఏళ్ల చిన్నారులపై బలాత్కారాలు జరుగుతున్నా పట్టించుకోని చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలి. రాజ్యాంగ ఉల్లంఘనలో, పార్టీ ఫిరాయింపుల్లో, రైతుల మీదున్న అప్పులు పెంచడంలోనూ చంద్రబాబు పాలన నంబర్‌ వన్‌గా ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకమునుపు రూ.96 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ఇప్పుడు రూ.2.25 లక్షల కోట్లకు చేరింది. మద్యం తాగించడంలోనూ చంద్రబాబు నంబర్‌ వన్‌గా ఉన్నారు. మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందోలేదో తెలియదుగానీ, మద్యం షాపులేని ఊరుందా? గుడి భూములు కొల్లగొట్టడంలోనూ ఆయన నంబర్‌ వన్‌గా ఉన్నాడు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడంలోనూ నంబర్‌ వన్‌ అయ్యాడు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.7 అదనంగా బాదుడే బాదుడు. ఎన్నికల వాగ్దానాలు ఉల్లంఘించడంలోనూ చంద్రబాబే నంబర్‌ వన్‌. 

చెరకురసం రంగులో కుళాయి నీరు 
ఈ నియోజకవర్గంలో దాదాపు 60 గ్రామాల్లో తాగేందుకు మంచి నీరు లేదని ప్రజలు చెబుతుంటే బాధనిపిస్తోంది. అయోద్యలంక గ్రామానికి చెందిన ప్రజలు ఈ బాటిల్‌ ఇచ్చి నన్ను మీటింగ్‌లో చూపించమన్నారు. ఈ బాటిల్‌లో నీళ్లు చెరుకురసం కాదు.. మేము తాగుతున్నవి అని చెబితే అప్పుడైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందని ప్రజలు అన్నా రు. జిల్లాలో  ఉంగుటూరు నుంచి నరసాపురం వరకు మంచినీరు లేని దుస్థితి. కుళాయిల్లో వస్తున్న నీళ్లు చెరుకురసం రంగులో వస్తున్నాయి. ఈ జిల్లా ప్రజలు నాకు 15కు 15 నియోజకవర్గాలు ఇచ్చారు కాబట్టి కుళాయిల్లో నీటికి బదులు చెరకు రసం ఇచ్చామని రేపటి ఎన్నికల్లో చెప్పుకున్నా ఆశ్చర్యంలేదు. టీవీల్లో చూసేవాళ్లను నమ్మించవచ్చని ఇలా చెప్పినా చెబుతారు. అయ్యా చంద్రబాబూ.. ఒక్కసారి ఈ జిల్లాకు వచ్చి నీ కొడుకుతో ఈ నీరు తాగించు. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్‌ మంత్రికదా.. అయనదే బాధ్యత. నాన్నగారి హయాంలో ఈ నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాలకు వంద ఎకరాలు సేకరించి.. సుమారు 8 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాడన్నా అని ఇక్కడి ప్రజలు చెప్పారు. పెనుగొండలోనే 38 ఎకరాల్లో పేదలకు పట్టాలిచ్చారని ప్రజలు గొప్పగా  చెబుతుంటే, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కనీసం ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా?

నేరాలు, ఘోరాలు, అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశారు. ఈ పాలన ముగిసేలోగా ఇంకెన్నింటిలో నంబర్‌ వన్‌ చేస్తారోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ పెద్దమనిషికి ఇప్పటికే 70 ఏళ్లు. కానీ ఈయన 2050 గురించి మాట్లాడతాడు. అప్పుడాయన వయసు 102 ఏళ్లు. అంటే 102 ఏళ్లు రాష్ట్రాన్ని అణువణువూ దోచేయాలనే తాపత్రయమేగా? అన్నేళ్లు పాలించాలనే దురాశ మీకుండొచ్చుగానీ, భరించే శక్తి మాత్రం రాష్ట్ర ప్రజలకు లేదయ్యా చంద్రబాబూ..  
 
ఈ జిల్లాలో సాగునీరు సరిగ్గా ఉండదు. రెండవ పంటకు నీరు వస్తుందో రాదో తెలీదు. తాగడానికి కూడా నీళ్లు లేని దుస్థితి. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఆక్వా రంగం పూర్తిగా మందగించింది. దేశానికే అన్నం పెట్టిన ఈ జిల్లాలోని రైతన్నలు నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వలసబాట పట్టే పరిస్థితి వచ్చింది.   

మరిన్ని వార్తలు