మోదీతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ

26 May, 2019 12:03 IST|Sakshi

విభజన హామీలపై చర్చ

ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రస్తావన

మోదీకి శుభాకాంక్షలు.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. విభజన హామీలను నెరవేర్చాలని, ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయాలని మోదీని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, పోలవరం, దుగరాజపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టులకు అదనపు నిధులను కేటాయించాలని మోదీని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రం అందకారంలో ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు. గంటకు పైగా సాగిన భేటీలో రాష్ట్ర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులపై మోదీ వద్ద జగన్‌ ‍ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్ర సంపూర్ణ సహకారం అందించాలని వినతి పత్రం అందించారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజం సాధించిన వైఎస్‌ జగన్‌ను మోదీ అభినందించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ప్రధానీ మోదీతో వైఎస్ జగన్ సమావేశం

ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం అనంతరం.. తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో చర్చించారు. ఈ సందర్భంగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకుని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఏపీ సీఎస్‌ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు