వైఎస్‌ జగన్‌ చెప్పిన నారాసురుని కథ

27 Mar, 2019 18:16 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతూ, ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలవేళ చంద్రబాబు చేస్తున్న కుట్రలను, మోసాలను టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను చిన్న చిన్న కథలతో ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతున్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో  వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘నారాసురుడు’ కథ ప్రజలందరిని ఆకట్టుకోవడమే కాకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఆలోచింపజేసేలా విధంగా ఉంది. 

‘చిన్నప్పుడు మనమంతా కథలు వింటాం. మహాభారతం, రామాణయం విన్నాం. రాక్షసుల గురించి విన్నాం. రావణాసురుడు అనే ఒక రాక్షసురుడు ఉండేవాడని చిన్నప్పుడు మన పెద్దవాళ్లు చెప్తే విన్నాం. ఆ రాక్షసుడికి 10తలలు ఉంటాయని కథల్లో విన్నాం. రావణాసురుడికి ఒకేచోట 10 తలలు ఉంటే.. ఇక్కడ మన రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడుకి మాత్రం విడివిడిగా, వేరువేరుగా తలలు ఉంటాయి. చంద్రబాబుకు ఒక తల తన నెత్తిన ఉంటుంది. ఇంకొక తల తన పెయిడ్‌ యాక్టర్‌, పెయిడ్‌ యాక్టర్‌ దగ్గర ఉంటుంది. మరొక తల ఈనాడు దిన పత్రిక, రాజగురు రూపంలో ఉంటుంది. చంద్రబాబు తోక పత్రిక రూపంలో ఇంకో తల ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులను నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది.  దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు రూపంలో ఇంకొక తల ఉంటుంది.

మీ అందరికి కనిపిస్తూ ఉంటాయి.. మన పార్టీ కండువాల మాదిరాగే వాళ్ల పార్టీ కండువాలు ఉంటాయి. మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్లు హెలికాప్టర్‌ గుర్తు ఉంటుంది. అక్కడ ఒక తల పెడతాడు ఈ చంద్రబాబు. ఇవన్ని సరిపోవన్నట్లు ఢిల్లీ నుంచి నాయకులను పిలుసుకొస్తారు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ల రూపంలో మరో తల పెడతారు చంద్రబాబు. వీళ్లందరిది ఒకటే మాట. ఒకటే డైలాగ్‌. ఒకటే లక్ష్యం. అదేంటంటే చంద్రబాబు నాయుడు పాలనపై చర్చ జరగకూడదు. చంద్రబాబు మోస పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని వాళ్లకు తెలుసు. వీళ్లందరి కోరిక, కుట్ర అంతా ఒకటే.. నిజాలపై చర్చ జరగకూడదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై చర్చ జరగకూడదు. వీళ్లంతా ప్రజల కళ్లను మరల్చడానికి కుట్ర పన్నుతున్నారు. వీళ్లే హత్యలు చేయిస్తారు. వీళ్ల పోలీసులచే విచారణ చేయిస్తారు. వీళ్ల పేపర్ల చేత వక్రీకరించి రాయిస్తారు. వీళ్లే టీవీలలో చర్చిస్తారు. ఇంతటి దారుణంగా టీవీలు పేపర్లు, చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ కుట్రలు చేస్తున్నారు’  అని రావణాసురుడితో చంద్రబాబును పోలుస్తూ ఆయన కుట్రలను వైఎస్‌ జగన్‌ వివరించారు.

>
మరిన్ని వార్తలు