జగన్‌కే జనామోదం

20 May, 2019 02:43 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీదే అధికారం

ఫలితాలు ఏకపక్షం.. వైఎస్‌ జగనే నూతన ముఖ్యమంత్రి  

135కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో గెలుపు తథ్యం

అన్ని జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు, మీడియా సర్వేల్లో వెల్లడి 

ప్రీ పోల్స్‌ సర్వే ఫలితాలను నిర్ధారించిన ఎగ్జిట్‌ పోల్స్‌  

ప్రతిపక్ష నేతను ఆదరించిన అన్ని వర్గాలు, ప్రాంతాలు 

వైఎస్సార్‌సీపీ – టీడీపీ మధ్య ఓట్లలో భారీ వ్యత్యాసం

‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైఎస్సార్‌ సీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్‌’ గెలుచుకోనుంది. మాట తప్పని, మడమ తిప్పని పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో ప్రాంతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అంతా వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉంటాయి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ప్రజలు తిరస్కరించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు టీడీపీకి చేదుగా ఉండవచ్చు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు రోజు వారికి వాస్తవం  బోధపడుతుంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది....’’
– ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడి

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే ఫలితాలే ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా తుదివిడత పోలింగ్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియగానే ఎన్‌డీటీవీ, టైమ్స్‌ నౌ, రిపబ్లిక్‌ టీవీ – జన్‌కీ బాత్, ఇండియాటుడే, మిషన్‌ చాణక్య, ఆరా, సీపీఎస్, ఏబీపీ నీల్సన్‌ మార్గ్‌ , సీఎన్‌ఎన్‌ న్యూస్‌ –18, ఐ పల్స్, కేకే సర్వీస్‌  తదితర సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని, కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే అధికార పగ్గాలు చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీకి మూడింట రెండొంతులకుపైగా మెజార్టీ ఖాయమని తెలిపాయి. 


ఫలితాలు ఏకపక్షం..
ప్రతిష్టాత్మక ఇండియాటుడే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 130–135 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 37–40 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. జనసేనకు ఒక్క సీటు లేదంటే అది కూడా రాకపోవచ్చని విశ్లేషించింది. ఇక ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి 18–20, టీడీపీకి 4–6 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం కూడా ఉందని తెలిపింది.  టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీకి 98 అసెంబ్లీ సీట్లు లభించగా టీడీపీకి 65 సీట్లు రావచ్చని తెలిపింది. జనసేనకు 2 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వైఎస్సార్‌ సీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. వీడీపీ అసోసియేట్స్‌ వైఎస్సార్‌సీపీకి 111–121 స్థానాలు, టీడీపీకి 54–60 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో తెలిపింది. ఇతరులు 4 చోట్ల గెలుపొందవచ్చు.

వైఎస్సార్‌సీపీ 133 నుంచి 135 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లకే పరిమితమవుతుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. జనసేన సున్నా లేదా ఒక్క స్థానంలో గెలుపొందే అవకాశం ఉంది. ‘ఆరా’ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ 126 సీట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీకి 47 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ 20–24 చోట్ల, టీడీపీ 1–5 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు తెలిపింది. కేకే సర్వేస్‌లో వైఎస్సార్‌ సీపీకి 130–135 సీట్లు లభించాయి. టీడీపీ 30–35 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులు 10–13 చోట్ల గెలుపొందే అవకాశాలున్నట్లు పేర్కొంది. మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీకి 98 స్థానాలు దక్కగా, టీడీపీకి 58 సీట్లు వచ్చాయి. ఇతరులు 7 చోట్ల నెగ్గే అవకాశం ఉంది. 

వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు 25 లోక్‌సభ స్థానాలకు.. 

ఎంపీ స్థానాల్లోనూ ‘ఫ్యాన్‌’ ప్రభంజనం
రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ 13–16 ఎంపీ సీట్లను వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని,  టీడీపీ 8–12 సీట్లలో నెగ్గుతుందని తెలిపింది. సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీకి 13–15 ఎంపీ సీట్లు లభించగా టీడీపీకి 10–12 సీట్లు వచ్చాయి. ఏబీపీ నీల్సన్‌ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ అత్యధికంగా 20 ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకే పరిమితమైంది. ఐ పల్స్‌ సంస్థ వైఎస్సార్‌ సీపీ 19–21 ఎంపీ సీట్లను, టీడీపీ 4–6 సీట్లను సాధిస్తాయని తెలిపింది. రిపబ్లిక్‌ సీ ఓటర్‌ 11 చోట్ల లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంటుందని, 14 చోట్ల టీడీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. కాగా వైఎస్సార్‌ సీపీ 8–12 ఎంపీ సీట్లను, టీడీపీ 13–17 ఎంపీ సీట్లను గెలుస్తాయని లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన అనంతరం పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ 72 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ 100 సీట్లు, జనసేన, ఇతరులు 3 సీట్లు గెలుస్తారని చెప్పారు. 

ఓట్ల శాతంలోనూ భారీ తేడా
వైఎస్సార్‌సీపీ, – టీడీపీ మధ్య ఓట్ల శాతంలోనూ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుందని వివిధ సర్వేలు తేల్చాయి. వైఎస్సార్‌సీపీకి 50.1 శాతం, టీడీపీకి 40.2 శాతం, జనసేనకు 7.3 శాతం, ఇతరులకు 2.6 శాతం ఓట్లు వస్తాయని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే పేర్కొంది.  ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌  ఉండాలని 45 శాతం మంది కోరుకున్నట్లు వీడీపీ అసోసియేట్స్‌ విశ్లేషణలో తేల్చింది.

అన్ని వర్గాల ఆదరణ అన్నకే
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని పలు సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ తదితర సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేశాం. అన్ని వర్గాల్లోనూ జగన్‌ పట్ల ఆదరణ కనిపించింది. చంద్రబాబు పసుపు – కుంకుమ పథకం వల్ల మహిళలు ఎక్కువగా టీడీపీకి  ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే మహిళల ఓట్లు వైఎస్సార్‌ సీపీకే పడ్డాయని మా సర్వేలో తేలింది’ అని ఆరా సంస్థ ప్రతినిధి మస్తాన్‌వలి తెలిపారు. ‘బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌వైపే నిలిచారు.’ అని సీపీఎస్‌ ప్రతినిధి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 

వంద శాతం నిజం 
‘ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు ఏమాత్రం పనిచేయలేదు. జనం జగన్‌కే జైకొట్టారు. పోలింగ్‌ సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. అందుకే ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నాయి. చంద్రబాబు అధికారమే పరమావధిగా గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, జాబు రావాలంటే, బాబు రావాలి..అంటూ అసత్య హామీలు ఇచ్చి అమలు చేయకుండా గాలికొదిలేశారు. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం అనేక ఎరలు వేసినా జనం నమ్మలేదు’ అని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ సంస్థల ప్రతినిధులు, చానళ్ల విశ్లేషణల్లో పాల్గొన్న సెఫాలజిస్టులు విశ్లేషించారు. ‘చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఏదో జరగరాని అద్భుతం జరిగినట్లే....’ అంటూ అది అసాధ్యమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఒక ఛానల్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. ‘మా ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తిగా ఎన్నికల ఫలితాలను ప్రతిఫలిస్తాయి. అత్యంత పకడ్బందీగా, అన్ని ప్రమాణాలతో శాస్త్రీయంగా నిర్వహించాం. ఏ ఫలితాలైనా ఒక పార్టీవారికే అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకంగా ఉన్నవారు ఎగ్జిట్‌పోల్స్‌నే తప్పుబట్టడం సరికాదు. మేం తప్పుడు ఫలితాలు ప్రకటించి మా సంస్థలను మూసుకుంటామా?’  అని  సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ సర్వే (సీపీఎస్‌) అధినేత ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌