సున్నా వడ్డీకే రుణాలు అందిస్తాం : వైఎస్‌ జగన్‌

28 Mar, 2019 13:49 IST|Sakshi

సాక్షి, చింతలపూడి/పశ్చిమగోదావరి : తమ పార్టీ అధికారంలో రాగానే పొదుపు సంఘాల మహిళలకు సున్నావడ్డీ రుణాలు అందిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయం నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న మహిళల రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని చింతలపూడిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయక తన కోసం వచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు మంచి చేయాలనే తలంపు గల చింతలపూడి వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి నిలిచిన ఎలీజాను...ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగిన కోటగిరి శ్రీధరన్నను గెలిపించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని బాబు అడ్డుకున్నారు..
వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ...‘సుదీర్ఘ పాదయాత్ర చేశాను. 3648 కిలోమీటర్లు నడవగలిగానంటే అందుకు దేవుడి దయ, మీ ఆశీస్సులే కారణం. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలు, బాధలు విన్నాను. పాదయాత్రలో భాగంగా చింతలపూడిలో పర్యటించినపుడు అవ్వా, తాత, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు నా దగ్గరికి వచ్చి చంద్రబాబు పాలనలో తాము అనుభవిస్తున్న కష్టాల గురించి చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ బతికి ఉంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యేదని రైతులు నాతో అన్నారు. ఐదేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో చూశాం. ఈ ప్రాజెక్టు ముంపు మండలాల రైతులకు ఒక్కొక్క మండలంలో ఒక్కో రీతిన నష్టపరిహారం చెల్లించారు.

ఒక‌ మండలంలో రూ. 19 లక్షలు... ఇంకొక‌ మండలంలో రూ. 12.50 లక్షలు మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారు.
ఇక్కడి రైతన్నలు పండిస్తున్న పామాయిల్ రేట్లలో కూడా చంద్రబాబు కోత విధిస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణాతో పోలిస్తే పామాయిల్‌ ధర సుమారు వెయ్యి రూపాయిలు తక్కువగా ఉందని రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా చింతలపూడిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రజలు నా దృష్డికి తెచ్చారు. వంద పడకల ఆసుపత్రి‌ లేకపొవడంతో 50 కిలోమీటర్ల దూరంలోని ఏలూరుకు వెళ్లాల్సి వస్తోందని తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుంటే అధ్వానంగా ఉన్న చింతలపూడి రోడ్లు బాబుకు గుర్తుకు వచ్చాయి. అందుకే చింతలపూడి నుంచి నామవరం వెళ్లే రోడ్డుకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలాంటి చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్దు’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

మీకు నేనున్నాను..
‘గిట్టుబాటు ధర రాక రైతన్నలు పడిన బాధలు చూశా. మధ్యతరగతి కుటుంబాల‌ కష్టాలు తెలుసుకున్నా. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ రాక డబ్బులు లేక...ప్రభుత్వం పట్టించుకోక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలను కలిశా. ఆరోగ్యశ్రీ అందక మంచాన పడ్డ పేదవాడి గుండె చప్పుడు విన్నాను. నిరుద్యోగ యువత ఆవేదన విన్నా. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు పెట్టిన యువత గాథలు విన్నా. అందుకే మీ అందరికీ నేనున్నా అనే భరోసా ఇస్తున్నా. ఐదేళ్లుగా మనల్ని మోసం చేసిన చంద్రబాబు కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల వేళ చంద్రబాబు మూటలు మూటల డబ్బులు పంపుతారు. ఆయనిచ్చే రూ. 3000 రూపాయిలకి మోసపోవద్దని ప్రతీ ఒక్కరికి చెప్పండి’  అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

రాజన్న రాజ్యం తెస్తా..
వైఎస్‌ జగన్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘అన్న వస్తున్నాడని చెప్పండి. అన్న వస్తే పిల్లాడిని బడికి  పంపిస్తే చాలు ఏడాదికి రూ. 15000 ఇస్తాడని ప్రతీ అక్కకి చెప్పండి. చంద్రబాబును నమ్మాం. ఐదేళ్ల సమయమిచ్చాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తాడని ఓటేస్తే నమ్మించి ‌మోసం చేశాడని చెప్పండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా వడ్డీ రుణాలు ఇవ్వటం లేదని చెప్పండి . మనం అధికారంలోకి వస్తే ప్రతీ అక్కకు ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు ధఫాలలో పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పండి. అంతేకాదు జగనన్న వస్తే మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాడని చెప్పండి. వైఎస్సార్ చేయూత పేరుతో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75000 ఇస్తాడని చెప్పండి. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. అన్న ముఖ్యమంత్రి అయితే ప్రతీ ఏటా మే నెలలో రూ. 12500 పెట్టుబడి సాయం చేస్తాడని రైతన్నకు చెప్పండి.  మీ మనవడు ముఖ్యమంత్రి అయితే మీ పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. రాజన్న రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు నిర్మాణం జరిగింది. మళ్లీ వైఎస్ జగనన్న సీఎం అయితే రాజన్న రాజ్యంలా ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పండి. నవరత్నాలలోని‌ ప్రతీ అంశం గురించి అన్ని వర్గాల వారికి తెలియజేయండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎలీజా, శ్రీధరన్నను గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు