ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి..

1 Dec, 2017 17:12 IST|Sakshi

సాక్షి, కర్నూలు :  చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?. మళ్లీ మనకు ఎన్నికలు వచ్చేసరికి మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనస్సాక్షిని అడగాలి. మోసాలు చేసే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అనేది మీరే ఆలోచించుకోండి.  చంద్రబాబు ప్రభుత్వంలో అంతా అవినీతే.... అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 23వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ ఊరువాకిలి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. అన్నివర్గాల ప్రజలను మోసం చేశారు. అలాంటి పరిస్థితి మారాలి. అందుకే పాదయాత్ర చేపట్టా. రాజన్న రాజ‍్యం మళ్లీ రావాలి. అందుకోసం నవరత్నాలు ప్రకటించా. పాదయాత్రలో మీరిచ్చే సలహాలతో వాటిని మరింత మెరుగ్గా మారుస్తా. రెండు, మూడు పేజీలతో మేనిఫెస్టో తెచ్చి అన్నీ అమలు చేస్తాం. ఉన్నత చదువుల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తా. ఖర్చుల కోసం ఏటా రూ.20వేలు చెల్లిస్తా. పిల్లాడు బడికి వెళ్లే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు ఇస్తా. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపడమే. పిల్లలు ఉన్నత చదువులు చదివితే పేదల బతుకులు బాగుపడతాయి. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే నాన్న ఆశ, నా కోరిక. అవ్వాతాతలను ఆదుకునేందుకు పెన్షన్‌ను రూ.2వేలకు పెంచుతా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ వయస్సును 45 ఏళ్లకు తగ్గిస్తా. ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టి ఇస్తాం. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత నాలుగు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తాం. రాజన్న రాజ్యం కోసం అందరూ సహకరించాలి.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ ఏం మాట్లాడారంటే..‘పోలరవంపై చంద్రబాబు ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు కొన్ని చానళ్లు, పేపర్లు తోడుగా ఉండి ఢంకా బజాయిస్తున్నాయి. కేంద్రం టెండర్లు పిలవనివ్వడం లేదని నానా యాగీ చేస్తున్నారు. కేంద్రం రాసిన లేఖలోని వివరాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్లోబల్‌ టెండర్లకు కనీసం 45 రోజుల సమయం కావాలి. కానీ చంద్రబాబు మూడు వారాలే గడువు ఇచ్చారు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ లేఖ రాశారు.

గత నెల 16న టెండర్లు ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌ ఇచ్చి....22 వరకూ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఈ అక్రమాలు ఆపి సరిచేయాలని కేంద్రం లేఖ రాస్తే...చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు. అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి రూ.58వేల కోట్లకు పెంచారు. చంద్రబాబు అవినీతిని లేఖ ద్వారా కేంద్రం ప్రశ్నిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టెండర్లు సక్రమంగా నిర్వహించాలని కేంద్రం కోరడం తప్పా. ఇలాంటి పరిస్థితి మారాలి. అందుకు ప్రజలంతా సహకరించాలి.

రాష్ట్రంలో చట్టం లేదు, నాయ్యం లేదు. పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. చట్టసభను దొంగల సభగా మార్చారు. 20 కోట్లు నుంచి 30 కోట్లు ఇచ్చి  ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారు. ఆ ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి...ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు... పదవి నుంచి తప్పుకోరు, జైలుకు కూడా వెళ్లరు. జన్మభూమి కమిటీలు అన్ని గ్రామ మాఫియాలుగా తయారు అయ్యాయి.  గ్రామాల్లో మట్టి నుంచి ఇసుక దాకా దోచేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.


మరిన్ని వార్తలు