గజదొంగ అసెంబ్లీని నడుపుతున్నట్లుంది..

30 Mar, 2018 01:21 IST|Sakshi
గుంటూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన సభకు భారీగా హాజరైన జనసందోహంలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

చట్టసభల్లోనే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు  

 పెదకూరపాడు సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు 

ఈ మధ్య కాలంలో ఎం.ఎల్‌.ఏ అనే సినిమా రిలీజ్‌ అయింది. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అన్నది ఆ సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే అంటే ‘మామూళ్లు.. లంచాలు తీసుకునే అబ్బాయి’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.  
 
లిఫ్ట్‌లకు నీళ్లు అందనంతగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయేలా ఇసుక తవ్వేశారు. వేలాది లారీలు పోతున్నాయన్నా అని దారిపొడవునా జనం చెబుతున్నారు. ప్రతీ వ్యవహారంలోనూ లంచాలు, కమీషన్లు.. ఎక్కడైనా అవినీతి చేసేవాళ్లు భయపడతారు. ఏపీలో మాత్రం సీఎంకు ఇంత వాటా, ఎమ్మెల్యేలకు ఇంత వాటా, చినబాబుకు ఇంత వాటా అన్నరీతిన అవినీతి జరుగుతోంది.   
 
ఈ ప్రభుత్వం నదులు, ఇసుక.. ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. చివరికి దేవుడి భూములను కూడా వదిలి పెట్టడం లేదు. ఈ నియోజకవర్గంలోని సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూములు చెన్నైలో ఉన్నాయి. వీటి ధర ఎకరం రూ.7 కోట్లు పలుకుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎకరం రూ.22 లక్షలకు అప్పనంగా కొట్టేయాలని చూశాడు. ఇందులో సీఎంకు భాగం ఇవ్వడానికి ఈ ఎమ్మెల్యే పన్నిన కుట్రను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. న్యాయపోరాటం చేసి ఆ భూములకు అసలు విలువ దక్కేలా చేసింది. 

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘నాలుగేళ్లుగా రాష్ట్రంలో మట్టి, ఇసుక, మద్యం, కాంట్రాక్టులు, బొగ్గు.. కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు.. తుదకు గుడి భూములను సైతం మేసిందే మేసుడు. పైన చంద్రబాబు మేస్తుంటే.. కింద గ్రామాల్లో మేయండని జన్మభూమి కమిటీలకు అప్పగించాడు. విచ్చలవిడిగా దోచుకున్న సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇచ్చి కొంటాడు. వాళ్లు రాజీనామాలు చేయరు.. వారిని అనర్హులుగా ప్రకటించరు. చంద్రబాబు మంత్రి వర్గంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలే నలుగురు ఉన్నారు. చట్టాలకు ఎలా తూట్లు పొడవాలనే రీతిలో ఇవాళ అసెంబ్లీ జరుగుతోంది. దీన్ని చూస్తుంటే.. ఒక గజదొంగే అసెంబ్లీని నడుపుతున్నట్టుగా ఉంది’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 123వ రోజు గురువారం గుంటూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

దేన్నీ వదిలి పెట్టడం లేదు.. 
‘‘ఈ నియోజకవర్గం (పెదకూరపాడు) ప్రజల మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ పాలకులు దేన్నీ విడిచి పెట్టడం లేదని, లంచాల మీద లంచాలు మేసేస్తున్నారని, అన్నీ దోచేస్తున్నారని ప్రజలు అంటున్నారు. కృష్ణా నదిలోని ఏడు రీచ్‌లలోంచి వేల కొద్ది లారీల్లో ఇసుక దోచేస్తున్నారు. యంత్రాలతో తవ్వేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డునే ఈ రకంగా వేల లారీలు, జేసీబీలు, పొక్లేనర్లు వాడుకుంటూ, విచ్చలవిడిగా ఇసుక తోలుకుంటున్నా అడిగే నాథుడే లేడు. వీళ్ల అవినీతి ఫొటోలతో సహా కన్పిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోరు. కారణమేంటంటే తీసుకునే లంచాల్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత అని వాటా అంట. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఎలా పనిచేస్తాయి? కృష్ణా నదిలో ఇసుక తవ్వడం వల్ల లిప్టులకు నీళ్లు అందడం లేదు. నీరు – చెట్టు పేరు చెప్పి దళితులు, పేదల భూములపై గద్దల్లా వాలిపోతున్నారు. అందులో మట్టి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో చక్కగా జరిగిందేంటో తెలుసా? అవినీతి. పైన చంద్రబాబు మేస్తుంటే.. కింద గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు మేయమని అప్పగించాడు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఏం కావాలన్నా ఆ కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే. ఇదీ రాష్ట్రంలో పాలన. నాలుగేళ్లుగా రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబే చెబుతున్నాడు. కాబట్టి మీకు ఎలాంటి నాయకుడు కావాలి? చంద్రబాబును ఇంకా క్షమిస్తే రేపు పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతాడు. ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు. మీరు నమ్మరని రూ.3 వేలు ఇస్తానం టాడు. వద్దనకుండా తీసుకోండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన సొమ్మే. మన జేబుల్లోంచి దోచిందే. కానీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. ఇలాంటి పాలనను బంగాళాఖాతంలో పడేసే పరిస్థితి రావాలి.  అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. ఇంకేమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. మీ వద్దకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా నిలబడండి’’ అని జగన్‌ కోరారు.   

మనందరి ప్రభుత్వం రాగానే రైతన్నల కోసం ఇలా చేస్తాం.. 
- వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.  
- ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా పంట రుణాలు ఇప్పిస్తాం.  
- మే నెలలోనే ప్రతీ రైతు కుటుంబానికి రూ.12500 అందిస్తాం.   
- ప్రతీ రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. 
- పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. 
- రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.  
- రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం.   
- పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.  
- పాడి ఆవులను సబ్సిడీపై అందిస్తాం. మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసిన రైతన్నలకు ప్రతీ లీటరుకు రూ.4 çసబ్సిడీగా ఇస్తాం.  

మరిన్ని వార్తలు