జగన్‌ అనే నేను..

26 Jul, 2018 03:05 IST|Sakshi
బుధవారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

మద్యం షాపులు లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా

పెద్దాపురం సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ

డిప్యూటీ సీఎం చినరాజప్ప నియోజకవర్గంలో ఆరుగురి హత్య 

సొంత సామాజిక వర్గం అణచివేతకు ఆయుధంగా మారారు.. 

బాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? 

పోలవరంలో దారుణ అవినీతి 

మంత్రి యనమల వియ్యంకుడికి ప్రాజెక్టు కాంట్రాక్టు

ఈ పెద్దమనిషిని ఇక నమ్మొద్దు..

నాలుగేళ్లుగా అన్నింట్లోనూ అవినీతే.. ప్రతి పనికీ లంచాలు 

మన ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటాం 

డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలను మొత్తాన్ని నాలుగు విడతలుగా వారి చేతికే ఇస్తాం  

ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తాం..ఆ ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ చేయిస్తాం

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్‌ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక 2024 ఎన్నికల నాటికి మద్యం షాపులను లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మద్యం బెడదతో పదో తరగతి పిల్లలు సైతం వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చినరాజప్ప చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు అవినీతి కల్పవృక్షంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం 220వ రోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్సార్‌ కలలను నిజం చేస్తానని, నాటి స్వర్ణయుగం మళ్లీ తెస్తానని హామీ ఇచ్చారు. ప్రతి చేనేత ఇంట్లో నాన్నగారి ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండేలా పాలన సాగిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
పక్కపార్టీ వాళ్లకు పెన్షన్లు ఇవ్వొద్దన్న పెద్దమనిషి రాజప్ప.. 
‘‘పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు నాతో చెప్పిన మాటేమిటంటే, అన్నా.. మా పెద్దాపురానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పేరు చిన రాజప్ప.. ఈయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.. హోంమంత్రి. కానీ ఇదే నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్లలో అక్షరాల ఆరు హత్యలు జరిగాయని చెబుతున్నారు. ఇదే పెద్దాయన అధికారులకు ఫోన్లు చేసి పక్క పార్టీ వాళ్లకు పెన్షన్లు కూడా ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారన్నా అని వాపోయారు. ఈయన చంద్రబాబుకు వంగి వంగి సలాంలు చేస్తూ.. బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్న తన సొంత సామాజిక వర్గానికి అండగా నిలవాల్సింది పోయి.. చంద్రబాబు అణచివేతలో తుపాకీలా మారి ఈయనే ఒక ఆయుధం అయ్యారన్నా అని చెబుతున్నారు. ఇంకా ఇక్కడి ప్రజలు నాకు చెప్పిందేమంటే అన్నా.. పక్కనే పోలవరం ప్రాజెక్టు ఉంది. నాన్నగారి పాలనలో ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాయి. ఈ పాలకుల హయాంలో నత్తనడకన సాగుతున్నాయి.

పునాదులు కూడా దాటలేదు. పోలవరాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాల్సింది పోయి ఈ ప్రాజెక్టును చంద్రబాబు అవినీతికి కల్పవక్షంగా మార్చుకున్నారన్నా అని రైతులు చెబుతున్నారు. తన బినామీలకు పోలవరం పనులు నచ్చిన రేట్లకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెడుతూ దోచుకుంటున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌ కూడా బినామీ సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారన్నా.. ఇలాగైతే ఎప్పుడన్నా ఈ పనులు పూర్తి అయ్యేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. పక్కనే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేసుకున్నారు. పంప్‌ హౌస్‌ ట్రెయిల్‌ రన్‌ కూడా జరిగిందని అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకుని పంపులతో నీళ్లు తరలించడం మొదలు పెడితే మాగతేమిటని ఇక్కడి రైతులు అడుగుతున్నారు. రబీ పంటకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. 
ఈ పెద్దమనిషి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. క్వింటాల్‌ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,550 రావాల్సి ఉంటే రూ.1130కు కూడా కొనడం లేదు. ఈ ప్రాంతంలో చెరకు సాగు చేస్తారు. టన్నుకు రూ.2,800 రేటు రావాల్సి ఉంటే రూ.2 వేలు కూడా గిట్టడం లేదన్నా అని రైతులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో టన్ను చెరకుకు రూ.3,150 ఇస్తున్నారని, ఇటీవల మరో రూ.200 పెంచారని చెబుతున్నారు. అయినా ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని రైతుల తరఫున చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. బెల్లం తయారు చేసుకుందామంటే దానికీ గిట్టుబాటు ధర లేకుండా చేశారు. నంబర్‌ వన్‌ బెల్లానికి రూ.3,200 కూడా రావడం లేదు. అదే నాన్నగారి హయాంలో ఇదే రకం బెల్లానికి రూ.5,200 గిట్టుబాటు ధర వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇదే జిల్లాలోని 11 మండలాల్లో 70 వేల ఎకరాల్లో సాగో (కర్రపెండలం) దుంపలు పండిస్తారు. గతేడాది పుట్టి అంటే 225 కిలోల దుంపల ధర రూ.1,600 ఉంటే పంట చేతికి వచ్చేసరికి అది కాస్తా రూ.1000కి పడిపోయిందని రైతులు వాపోతున్నారు.

మెట్ట ప్రాంతాల కోసం డెల్టా ఈస్ట్రన్‌ కెనాల్‌పై బ్రహ్మదేవం–1, 2, వేట్లపాలెం, కాపవరం, లింగాల ఎత్తిపోతల పథకాలుంటే వాటిని సరిగా నిర్వహించలేక మరమ్మతులకు గురైతే నాన్నగారి హాయంలో వీటిని గాడిలో పెట్టారని చెబుతున్నారు. ఈ లిప్టులకు ఉచిత విద్యుత్‌ కూడా ఇచ్చి 13 గ్రామాలకు ఎనలేని మేలు చేశారన్నా.. అని రైతులు చెప్పారు. మేడపాడు ప్రాంతంలో మరో కొత్త ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తాగు, సాగు నీరు ఇచ్చారని నాన్నగారిని తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. ఇవాళ అవే ప్రాజెక్టులకు కరెంటు బిల్లులు కట్టలేమని, వాటాల రూపంలో నీళ్లు ఇచ్చుకోమని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? రామేశ్వరంపేట, కానూరు, కొండపల్లి, వాలుతిమ్మాపురం గ్రామాల్లో దాదాపు 850 ఎకరాల్లో 1,200 మంది దళితులకు దశాబ్దాల క్రితం భూములు పంపిణీ చేశారన్నా.. మళ్లీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరో 670 ఎకరాలు ఇచ్చి, బోర్లు వేయించి అండగా నిలిచారన్నా.. అని చెబుతూ ఇప్పుడా భూముల్లో లెవలింగ్‌ పేరిట నాలుగు అడుగులు అని చెప్పి 50 అడుగుల ఎత్తు ఉండే గ్రావెల్‌ కొండను తొవ్వేసి లారీ మట్టిని, రాళ్లను రూ.1300కు టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారంటే ఇంతకన్నా అన్యాయం ఏముంటుదన్నా? అని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు హోం మంత్రి కొడుకు పేరు కూడా ఇందులో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  
 
తాగునీటి సమస్య ఎలా ఉందంటే.. 
పెద్దాపురం, సామర్లకోటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాలతో కాలువల్లో నీరు కలుషితమవుతుందని, ఈ నీరు తాగలేక ఏటా వందలాది మంది డయేరియా వ్యాధిన పడుతున్నట్టు స్థానికులు చెప్పారు. ధవళేశ్వరం నుంచి నేరుగా పైపులైన్‌ వేస్తే ఈ పరిస్థితి తప్పుతుందని చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధనిపిస్తోంది. ఇక ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ పక్కనే పెద్దాపురం ఆసుపత్రి ఉంది. ఇది పేరుకే 100 పడకల ఆసుపత్రి. అక్కడ బెడ్డులు మాత్రం 58 మాత్రమే ఉన్నాయని, 12 మంది డాక్టర్లకు బదులు నలుగురు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్టు, ఎముకల డాక్టర్‌ లేరని ప్రజలు చెబుతున్నారు. మూడు అంబులెన్స్‌లకుగాను ఒక్కటీ పని చేయడం లేదు. 24 మంది నర్సులకు 9 మంది ఉన్నారు. ఆ పక్కనే సామర్లకోట ఆసుపత్రి. అది పేరుకే 30 పడకల ఆస్పత్రి. అక్కడ ఉన్నది కేవలం ఆరు పడకలే. ఇద్దరు డాక్టర్లే... ఇక ఆ ఆసుపత్రి ఉండి లాభమేమిటని జనం వాపోతున్నారు.

సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 1000 మందికి, సామర్లకోటలో 1400 మంది పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ది అయితే ఇప్పటి ప్రభుత్వం, టీడీపీ నాయకులు తమ స్థలాలను లాక్కుంటున్నారన్నా అని చెబుతున్నారు. సామర్లకోటలో 12 ఎకరాలు, పెద్దాపురం వాలు తిమ్మాపురంలో 32 ఎకరాలను ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తే వాటిని ఈ తెలుగుదేశం నాయకులు గుంజుకుని వాటిల్లో ఫ్లాట్లు కట్టిస్తామంటున్నారట. రూ.3 లక్షలు విలువ చేసే ఫ్లాటును రూ.6 లక్షలకు అమ్ముతారట. ఇందులో రూ.3 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే, మిగతా రూ.3 లక్షలు పేదవాడిపై అప్పుగా రాస్తారట. ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేల చొప్పున కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు.. వాటిని తీర్చేది మాత్రం పేదవాడు. ఇంతకన్నా దారుణం, అన్యాయం ఉంటుందా? ఎన్నికల సమయం దగ్గర పడుతోంది గనుక చంద్రబాబు ఫ్లాట్ల పంపిణీ అంటూ వస్తాడు. ఒక వేళ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. ఆ తర్వాత మనందరి ప్రభుత్వం రాగానే ఆ ఫ్లాట్లపై మీరు బ్యాంకులకు కట్టాల్సిన రూ.3 లక్షల రుణం మొత్తం మాఫీ చేస్తానని మాట ఇస్తున్నా. 
  
ప్రతి ఇంట్లో నా ఫొటో కూడా ఉండేలా మేలు చేస్తా.. 
ఈ నియోజకవర్గంలోని చేనేతలు, అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. చంద్రబాబు నూలుపై సబ్సిడీ ఇవ్వరు. వెయ్యి మందిలో ఇచ్చే పది మందికి కూడా సకాలంలో ఇవ్వరు. ఆఫ్కోకు చేనేతల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు ఇవ్వాల్సిన బకాయిలు పది నెలలుగా ఇప్పటికీ పెండిగ్‌లో ఉన్నాయి. కొత్తగా ఆర్డర్లు ఇవ్వరు. చేనేత పరిశ్రమ పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వచ్చిందని ఇక్కడ చేనేతలు చెబుతున్నారు. ప్రతి చేనేత సోదరుడికి చెబుతున్నా.. మళ్లీ ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని తీసుకొస్తా. దేవుడి ఆశీర్వాదం, మీ చల్లని దీవెనలతో రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాన్న ఫొటోతోపాటు నా ఫొటో కూడా ఇంట్లో పెట్టుకునేలా ప్రతి చేనేత కుటుంబానికి మేలు చేస్తా.

ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ మంచి జరగలేదు. అన్నింటా అవినీతే. ఇసుక, మట్టి మొదలు.. రాజధాని, గుడి భూములు కూడా వదలకుండా దోచేశారు. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌« ధరలు, ఆర్టీసీ బస్‌ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూళు ఫీజులు బాదుడే బాదుడు. ఇవాళ ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేశారు. నాలుగున్నరేళ్లుగా ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. గర్భవతులు డెలివరీ చేయించుకోవాలంటే రూ.50 వేలకు తక్కువ ఏ ఆస్పత్రిలోనూ అడగడం లేదు. ఇంతటి దారుణంగా ఆరోగ్యశ్రీలో మార్పులు చేశారు. ఇవాళ 108కి ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితి లేదు. రేషన్‌ దుకాణానికి వెళితే బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ప్రతి పనికీ లంచాలే. 
 
బాబును క్షమిస్తే ఏమవుతుందంటే... 
పొరపాటున చంద్రబాబును క్షమిస్తే రేపు పొద్దున ఈ పెద్దమనిషి ఎన్నికలొచ్చే సరికి మైకు పట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 98 శాతం హామీలు అమలు చేశానని మన చెవుల్లో పూలు పెడతాడు. ఈ సారి ఎన్నికల్లో ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. అయినా మీరు నమ్మరని.. ప్రతి ఇంటికి మహిళ సాధికార మిత్రలను పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బుంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే.

మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసం చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ మధ్య కొత్త సినిమా చూస్తున్నాం. ప్రత్యేక హోదా.. చంద్రబాబు గారి డ్రామాలు. రోజూ టీవీలు, పేపర్లలో కనిపిస్తుంది. నాలుగేళ్ల ఈ పెద్దమనిషి పాలనలో మోసం, అబద్ధం, అవినీతి, అన్యాయం అనే పదాలు కనిపిస్తున్నాయి. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలంటే అది ఒక్క జనగ్‌ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు, దీవెనలు కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

మనందరి ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం.. 
– ఎన్నికలకు ముందు ఈ పెద్దమనిషి (చంద్రబాబు) పొదుపు సంఘాల అక్కచెళ్లమ్మల అప్పులు మాఫీ చేస్తానని చెప్పి రూపాయి కూడా మాఫీ చేయలేదు. సున్నా వడ్డీకి సంబంధించి 2016 సెప్టెంబర్‌ నుంచి బ్యాంకులకు డబ్బులు చెల్లించలేదు. ఈ పెద్దమనిషి అధికారంలోకి వచ్చే సరికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయి. మొన్న చంద్రబాబు గారు చేసిన స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) రివ్యూలో ఈ రుణాలు రూ.20 వేల కోట్లు దాటాయని బ్యాంకర్లు చెప్పారు. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నాం. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంతైతే రుణాలు ఉంటాయో నాలుగు దఫాలుగా ఆ మొత్తం నేరుగా అక్కచెల్లెమ్మల చేతికే ఇస్తా. వారు తమ కాళ్ల మీద తాము నిలబడేటట్లు చేస్తా. సున్నా వడ్డీకే రుణాలు వచ్చేలా చేస్తాం.   

– ఎన్నికలప్పుడు ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం, అందరికీ ఇళ్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? దివంగత నేత సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కడితే.. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మరో 48 లక్షల ఇళ్లు ఐదేళ్లలో రాజశేఖరరెడ్డిగారు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. ఆ పాలన మళ్లీ తీసుకొస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం. ఆ ఇళ్లను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్టర్‌ చేయిస్తాం. రేపు ఎప్పుడైనా డబ్బుతో అవసరం పడి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటే పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.
 
– ఇవాళ ప్రతి గ్రామంలో వీధి చివర, ఇంటి పక్కన, స్కూలు పక్కన మందుషాపు కనిపిస్తోంది. చదువుకున్న పిల్లలు తాగుడుగు అలవాటుపడుతున్నారు. అక్కచెల్లెమ్మల సంసారాలన్నీ నాశనం అవుతున్నాయి. ఈ పరిస్థితిని మారుస్తాం. 2018లోనో, 2019లోనే ఎన్నికలు జరుగుతాయి. తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలొస్తాయి. అప్పటికి, జగన్‌ అనే నేను.. మళ్లీ ఎన్నికలకు మీ వద్దకు వచ్చేనాటికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని అక్కచెల్లెమ్మలకు హామీ ఇస్తున్నా.    
 
సోమవారం సోమవారం చంద్రబాబు పోలవరం ఎందుకు వస్తున్నారో తెలుసా అన్నా.. ఆయన ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్లతో లెక్కలు (కమీషన్లు) తేల్చుకుపోతున్నారన్నా’ అని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇదే చంద్రబాబు పోలవరం పనులు 56 శాతం పూర్తయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇందులో 80 శాతం.. కుడి, ఎడమ కాలువల పనులు ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయన్న విషయాన్ని పక్కకు నెట్టి అంతా తన హయాంలోనే జరిగినట్టుగా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? 
 
పెద్దాపురం, జి.తిమ్మాపురం, రాగంపేట గ్రామాల్లో నీరు–చెట్టు పేరిట చెరువులను తాటిచెట్టు ఎత్తు లోతు తవ్వి మట్టిని అమ్ముకుంటూ మరోపక్క ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నట్టు ప్రజలు చెబుతున్నారు. నీరు–చెట్టు పథకం అంటే చెరువుల్ని బాగు చేయడమా? లేక మట్టిని అమ్ముకోవడమా? ఒకవైపు చెరువుల్ని తవ్వినందుకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ.. మరోవైపు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. వేట్లపాలెం వెంకటపతిరాజు చెరువుకైతే ఏకంగా చంద్రబాబే రిబ్బన్‌ కట్‌ చేసి దోపిడీకి శ్రీకారం చుట్టారన్నా అని ప్రజలు చెబుతున్నారు. మట్టి, ఇసుక సహా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు ఈ పాలకులు. 

మరిన్ని వార్తలు